అంగన్‌వాడీలపై పర్యవేక్షణ శూన్యం

ABN , First Publish Date - 2020-11-29T04:48:09+05:30 IST

అంగన్‌వాడీలపై పర్యవేక్షణ శూన్యం

అంగన్‌వాడీలపై పర్యవేక్షణ శూన్యం
ఐసిడిఎస్‌ జిల్లా కార్యాలయం

అధికారులకు ఖరీదైన వస్తువులు, చీరెలు నజరానా ?

ఖమ్మం ఖానాపురంహవేలీ, నవంబరు 28: అంగన్‌వాడీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరవైందనే విమర్శలు తీవ్రస్థాయిలో వినవస్తున్నాయి. కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా  కన్నెత్తి చూడటంలేదనే వివర్శలు విన్పిస్తున్నాయి. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో ఏమాత్రం శ్రద్ధవహించకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. నిత్యం కేంద్రాలను పర్యవేక్షించవలసిన అధికారులు అసలు ఎక్కడ తిరుగుతున్నారో కూడా తెలియడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

 కరోనా అలుసు

 కరోనాతో మార్చి నెల నుంచి అంగన్‌వాడీకేంద్రాలు పూర్తిగా మూసివేశారు. నాటి నుంచి నేటివరకు కేంద్రాలను తెరవడంలేదు. అయితే ప్రభుత్వ ఆదేశాలమేరకు లబ్ధిదారులకు సరుకులను అందిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు కేంద్రాలకు రావడమే మానేశారు. లబ్ధిదారులకు అందించాల్సిన సరుకుల్లో కూడా కాంట్రాక్టర్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అంగన్‌వాడీ టీచర్లను మచ్చిగ చేసుకుని  సరుకులకు సంబంధించిన వేలు ముద్ర  వేయించి అవే సరుకులను తక్కువ ధరలకు సదరు కాంట్రాక్టరే కొనుగోలు  చేస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.  

 ఖరీదైన వస్తువులు, చీరెలు నజరానాలు

కొందరు అధికారులకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు భారీ నజరానాలు అందిస్తున్నట్లు  జిల్లాలో చర్చ జరుగుతోంది. కేంద్రాలను పర్యవేక్షించకుండా ఉన్నందుకు వారికి ఖరీదైన వస్తువులు, చీరలను నజరానాగా అందిస్తున్నారనే వాదనలు వినబడుతున్నాయి.  


Updated Date - 2020-11-29T04:48:09+05:30 IST