విద్యార్థుల్లో రక్తహీనత..!

ABN , First Publish Date - 2022-08-04T05:23:50+05:30 IST

విద్యార్థులను రక్తహీనత వెంటాడుతోంది. రక్తహీనతతో బాధపడుతున్న బాలబాలికలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడానికి నిర్వహిస్తున్న సర్వే నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి గత నెల 30వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారో గుర్తించాలి. కానీ ఇప్పటివరకు 52 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది.

విద్యార్థుల్లో రక్తహీనత..!
డొంకూరు పాఠశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

- పాఠశాలల్లో నత్తనడకన సాగుతున్న పరీక్షలు
- ఇప్పటికి 52 శాతం పూర్తి
(ఇచ్ఛాపురం రూరల్‌)

విద్యార్థులను రక్తహీనత వెంటాడుతోంది. రక్తహీనతతో బాధపడుతున్న బాలబాలికలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడానికి నిర్వహిస్తున్న సర్వే నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి గత నెల 30వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారో గుర్తించాలి. కానీ ఇప్పటివరకు 52 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 1 నుంచి  ఇంటర్మీడియట్‌ వరకు 4.45 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల రక్తనమూనాలు సేకరించి వారిలో హిమోగ్లోబిన్‌ శాతం, ఎత్తు, బరువు చూడాలి. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ఐరన్‌ మాత్రలు పంపిణీ చేయాలి. బరువు తక్కువగా ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలి. ఈ మేరకు రెండు వారాలుగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు విద్యార్థుల నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.20 లక్షల మంది రక్త నమూనాలు పరీక్షించగా.. 12,526 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. సాధారణంగా రక్తంలో హిమోగ్లోబిన్‌ 12 శాతం ఉండాలి. ఎక్కువ మంది విద్యార్థుల్లో 9 శాతం మాత్రమే ఉందని పరీక్షల్లో స్పష్టమవుతోంది. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి గురువారం ఐరన్‌ మాత్రలు ఇస్తుంటారు. రక్తహీనత ఉన్న విద్యార్థులకు కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ మాత్రలు పంపిణీ చేస్తారు. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. బలహీనంగా ఉన్న విద్యార్థులకు నిత్యం తీసుకుంటున్న ఆహారానికి అదనంగా ఆకుకూరలు, పండ్లు తదితర పౌష్టికాహారం తీసుకునేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఐరన్‌ మాత్రలు, వేరుశెనగ చక్కీలు పంపిణీ చేస్తున్నా.. విద్యార్థుల్లో రక్తహీనత కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. గడువు ముగిసినా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ రక్తనమూనాలు సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు.

అందరికీ నిర్వహిస్తాం :
జిల్లాలో ఇప్పటివరకు 52 శాతం రక్త పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తించి ఐరన్‌ మాత్రలు పంపిణీ చేస్తాం. బరువు తక్కువ ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తాం. ఏఎన్‌ఎంలకు మిగిలిన విధులు కూడా ఉన్నందున సర్వే ఆలస్యమవుతోంది. ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబరు మొదటి వారానికి శతశాతం రక్త పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.
- డి.అప్పలనాయుడు, ఆర్‌బీఎస్‌కే అధికారి, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-08-04T05:23:50+05:30 IST