Andhra, Telanganaల సమ్మేళనం ‘మాలపల్లి’ : ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-10-30T17:06:39+05:30 IST

మాలపల్లి నవల లేకుంటే తొలితరం దళిత ఉద్యమనాయకుడు భాగ్యరెడ్డి వర్మ....

Andhra, Telanganaల సమ్మేళనం ‘మాలపల్లి’ : ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ : మాలపల్లి నవల లేకుంటే తొలితరం దళిత ఉద్యమనాయకుడు భాగ్యరెడ్డి వర్మ భారతీయ సమాజంలో నిర్వహించిన వాస్తవ స్థితి తెలిసుండేది కాదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. తెలుగులో వెలువడిన తొలి రాజకీయ నవల, దళితులు ప్రధాన పాత్రలుగా సాగిన మొదటి నవల ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ‘మాలపల్లి’ అని పేర్కొన్నారు. వ్యవహారిక భాషలో వెలువడటంతో పాటు రష్యా విప్లవాన్ని ప్రతిఫలించిన తొలి తెలుగు నవల కూడా ఇదే అన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనమే ‘మాలపల్లి’ నవల అని అభివర్ణించారు. 


అందులోని సంఘనిర్మాణం అధ్యాయం ప్రత్యేకతను విశ్లేషించారు. మంచిపుస్తకం ఆధ్వర్యంలో ‘మాలపల్లి’ శతావలోకనం ఉపన్యాసమాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆన్‌లైన్‌ వేదికగా ‘మాలపల్లిలో భాగ్యరెడ్డి వర్మ పాత్ర’ అంశంపై కె.శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘1917లో విజయవాడ వేదికగా సాగిన పంచమాంధ్ర మహాసభలకు తెలంగాణ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ సభాధ్యక్షుడిగా హాజరయ్యా రు. అదే సందర్భాన్ని ఉన్నవ ‘మాలపల్లి’ నవలలో అక్షరీకరించడంతో పాటు వెంకటరెడ్డి పాత్ర ద్వారా భాగ్యరెడ్డి వర్మ భావాలను పలికిస్తారు’’ అన్నారు.


అదే నవలలోని సామాజిక న్యాయవాదానికి ప్రతీకగా నిలిచే సంగదాసు పాత్రకు భాగ్యరెడ్డి వర్మకు మధ్య సారూప్యతను కె.శ్రీనివాస్‌ వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ సాగించిన సామాజిక, సంఘ సంస్కరణోద్యమాలను ప్రస్తావించారు. ఆధునిక చరిత్రలోని ముఖ్యమైన విషయాలను డాక్యుమెంట్‌ చేసిన ‘మాలపల్లి’ నవలలోని కొన్ని విషయాలు సమకాలీన పరిస్థితులకూ అనువర్తిస్తాయని అన్నారు. సాహితీ విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Updated Date - 2021-10-30T17:06:39+05:30 IST