రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరాచకాలు

ABN , First Publish Date - 2021-10-26T06:41:27+05:30 IST

: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరాచకాలు
కోదాడలో అభివాదం చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేసీఆర్‌ పాలనలో కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు 

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే 

వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ , కోదాడ టౌన్‌, అక్టోబరు 25: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల్లో టీఆర్‌ఎ్‌స ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అరాచకాలను దేశంలోని పెద్దల దృష్టికి తీసుకెళతానన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం భయపెట్టి అన్ని వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం అవినీతి పరులైన టీఆర్‌ఎస్‌ నేతలపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ రియల్‌ ఎస్టేట్‌, మద్యం వ్యాపారంలో ఐదు శాతం కమీషన్‌ తీసుకుంటుంది నిజం కాదా? అన్నారు. తనను విమర్శించేస్థాయి మల్లయ్యయాదవ్‌కు లేదన్నారు. మల్లయ్యయాదవ్‌ చిల్లర మాటలు మానుకొని, నియోజవర్గ సమస్యలపై దృష్టిసారించాలని తెలిపారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ మల్లయ్యయాదవ్‌కు కాంగ్రెస్‌ను విమర్శించేస్థాయి లేదన్నారు. తొలుత హుజూర్‌నగర్‌ పట్టణంలోని సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మునగాల ఎంపీపీ బింధు భర్త నరేందర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, ఎంపీపీ బిందు, తన్నీరు మల్లికార్జున్‌రావు, కొట్టే సైదేశ్వరరావు, కస్తాల శ్రావణ్‌, గోపాల్‌, రామ్మూర్తి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:41:27+05:30 IST