పోలీసునంటూ వివాహితను బెదిరించి.. తన గదికి తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2020-07-07T15:13:14+05:30 IST

ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన..

పోలీసునంటూ వివాహితను బెదిరించి.. తన గదికి తీసుకెళ్లి..

వివాహితపై ఇద్దరు అత్యాచారం

బెదిరించి.. బంధించి.. 

పలుమార్లు అఘాయిత్యం

నిందితులలో ఒకరు ఏఆర్‌ కానిస్టేబుల్‌


బుక్కరాయసముద్రం(అనంతపురం): ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బుక్కరాయసముద్రం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉండటం గమనార్హం. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఎస్కేయూ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నరేష్‌తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇద్దరు కలిసి బుక్కరాయసముద్రం మండలంలోని బోయకొట్టాల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లారు.


ముళ్ల పొదల వద్ద మాట్లాడుకుంటున్న సమయంలో చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ వచ్చాడు. తాను పోలీసునంటూ వారిద్దరిని బెదిరించాడు. అనంతరం ఆ మహిళను అనంతపురంలో వదిలి పెడతానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి అనంతపురంలోని కొవ్వూర్‌నగర్‌లో ఉన్న తన రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడైన అనంతపురంలో పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ సురేంద్రనాథ్‌రెడ్డిని పిలిపించాడు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు.


ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మహిళను రూమ్‌లో బంధించి ఇద్దరూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి చెప్పవద్దని తనను బెదిరించి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద విడిచిపెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఈ విషయంపై ఆమెకు పరిచయం ఉన్న నరేష్‌ 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఏఆర్‌ కానిస్టేబుల్‌తో పాటు రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిప్రసాద్‌ తెలిపారు. ఆమె భర్త గతంలో మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-07T15:13:14+05:30 IST