అనంతపురం: జిల్లాలోని కదిరి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పాత చైర్మన్ వీధిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా... మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద నుంచి ఆరుగురిని అధికారులు బయటకు తీశారు. ఎలాంటి పిల్లర్లు లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న మరో రెండు ఇళ్లకు స్వల్ప ప్రమాదం జరిగింది. జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.