మూడో ముప్పు నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంపు

ABN , First Publish Date - 2022-01-07T06:37:28+05:30 IST

కరోనా మళ్లీ విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రులో పరీక్షల సంఖ్యను వైద్యశాఖ అధికారులు పెంచారు.

మూడో ముప్పు నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంపు
చింతపల్లిలో పాఠశాలకు హాజరైన ఒకే విద్యార్థికి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

నల్లగొండ అర్బన్‌, జనవరి 6: కరోనా మళ్లీ విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రులో పరీక్షల సంఖ్యను వైద్యశాఖ అధికారులు పెంచారు. కాగా, పరీక్షల సంఖ్య పెరగడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఒక్క గురువారం 7 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేంద్రాల్లో గురువారం నుంచి పరీక్షల సంఖ్య పెంచారు. ఇకపై నిత్యం ఒక్కో కేంద్రంలో 100కు పైగా పరీక్షలు, జిల్లా వ్యాప్తంగా 3500 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆర్టీపీఆర్సీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.


లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలు

జలుబు, దగ్గు, జ్వర పీడితులు, అనుమానం ఉన్నవారు వెంటనే దగ్గరిలోని కేంద్రానికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు. అక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే హోం ఐసోలేషన్‌లో ఉండటం గానీ లేదంటే ఆస్పత్రుల్లో గానీ చేరి వైద్య చికిత్సలు పొందవచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి మెడికల్‌ కిట్‌ అందజేస్తారు. 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షచేస్తారు. ఇదిలా ఉండగా గత ఏడాది జనవరి నెలలో సైతం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. కాగా, ఈ ఏడాది నెలాఖరు వరకు పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అనుమానం ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించేలా టెస్టుల సంఖ్య పెంచారు. అదే విధంగా కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఇప్పటికే పడకలను, ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 10,91,518 మందికి పరీక్షలు నిర్వహించగా, 73,348 మంది పాజిటివ్‌ బారినపడి కోలుకున్నారు. ప్రస్తుతం 49 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 20 మంది ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలు పొందుతుండగా, మిగతా వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 388 మంది కరోనాబారీన పడి మృతిచెందారు.


పిల్లలకు ముమ్మరంగా వ్యాక్సినేషన్‌

జిల్లా వ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం నాటికి మూడో రోజుకు చేరింది. తొలి రోజు ప్రజల నుంచి స్పందన తక్కువగా కన్పించినా, ప్రస్తుతం కరోనా కేసులు పెరగడంతో పిల్లలకు టీకా వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 12,368 మందికి వైద్య సిబ్బంది టీకా వేశారు. మూడు రోజుల్లో ఇప్పటి వరకు 20,780మంది పిల్లలకు టీకా వేశారు. ఇక 18 ఏళ్లు పైబడిన వారికి సైతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు తొలి డోస్‌ 12,13,411 మందికి, రెండో డోస్‌ 7,18,997 మందికి వేశారు. సంక్రాంతి సెలవులు సమీపిస్తుండటంతో పిల్లల వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య సిబ్బంది భావిస్తున్నారు.  


పాఠశాలకు ఒకే ఒక్కరు హాజరు

చింతపల్లి: చింతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా పాజిటివ్‌ కలవరంతో గురువారం ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యాడు. 294మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ నెల 3వ తేదీన ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 4వ తేదీన మరో ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 5వ తేదీన పాఠశాలకు 19మంది విద్యార్థులే హాజరుకాగా, గురువారం 10తరగతి విద్యార్థి శీలం సాత్విక్‌ ఒక్కడే పాఠశాలకు వచ్చాడు. అతడు సైతం మధ్యాహ్నం పాఠశాలకు రాలేదు.

Updated Date - 2022-01-07T06:37:28+05:30 IST