రూ.2.50 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను

ABN , First Publish Date - 2021-04-13T05:40:18+05:30 IST

అది ప్రభుత్వ భూమి. నివాస గృహాలకు అనువైనది. రూ.2.50 కోట్లకు పైగా విలువ చేసే ఆ భూమి ఖాళీగా ఉండడంతో కొందరు నేతల కన్ను పడింది. అంతే దర్జాగా ఆక్రమించేసి బేరం పెట్టారు. అయితే ఈ విషయాన్ని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు.

రూ.2.50 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను
కబ్జారాయుళ్లు కన్నేసిన రూ.2.50 కోట్ల విలువ చేసే భూమి ఇదే

హెచ్చరిక బోర్డు తొలగింపు

కబ్జారాయుళ్ల బరి తెగింపు


అది ప్రభుత్వ భూమి. నివాస గృహాలకు అనువైనది. రూ.2.50 కోట్లకు పైగా విలువ చేసే ఆ భూమి ఖాళీగా ఉండడంతో కొందరు నేతల కన్ను పడింది. అంతే దర్జాగా ఆక్రమించేసి బేరం పెట్టారు. అయితే ఈ విషయాన్ని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. కట్‌ చేస్తే.. ఆ భూమిని దక్కించుకోవాలనుకున్న కొందరు ఓ నేత అండ చూసుకుని ఆక్రమించే ప్రయత్నాలు తిరిగి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలనే ఆ స్థలంలో పాతిన హెచ్చరిక బోర్డులను తొలగించేసి కబ్జాకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 


కడప, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):  కడప రెవెన్యూ పరిధిలోని గూడూరు రెవెన్యూ పొలం రామరాజుపల్లె సర్వే నెం.145/1లో 76 సెంట్లు, 146లో 32 సెంట్ల ప్రభుత ్వ భూమి ఉంది. ఈ ఖాళీ స్థలాన్ని పేదలకు ఇవ్వాలంటూ చాలా రోజులుగా డిమాండ్‌ ఉంది. గతంలో ఇక్కడ ఇంటి స్థలం ఇప్పిస్తామంటూ కొందరు పేదల నుంచి డబ్బులు వసూలు చేసి కొందరు పత్తా లేకుండా పోయినట్లు ఆరోపణలున్నాయి. నివాసయోగ్యానికి అనుకూలమైన స్థలం కావడంతో కొందరు నేతలు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కడప నగరంలో ఇటీవల నివాస స్థలాలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రధాన ప్రాంతాల్లో సెంటు జాగా కొనాలన్నా కొన్ని చోట్ల అయితే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధర పలుకుతోంది. దీంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు శివారు ప్రాంతాల్లో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరం చుట్టూ విస్తరిస్తోంది. రామరాజుపల్లెలో కూడా నివాస స్థలానికి మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్‌ ధర చూస్తే ప్రభుత్వ భూమి సెంటు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతోంది. సమీపంలో కొప్పర్తి పారిశామ్రికవాడ ఉండడం, అక్కడ పలు కంపెనీలు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భూములకు ధర పెరిగింది. ఇక్కడున్న ప్రభుత్వ భూమి సుమారు రూ.2.50 కోట్లపైనే ఉంటుంది. 


ఇలా ఆక్రమణ

నగర శివారు ప్రాంతం విస్తరించ డం, పారిశ్రామికవాడలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నివాస స్థలాలకు గిరాకీ పెరుగుతుందని భావించిన కొందరు నేతలు ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సొంత భూమిగా రికార్డులు తయారు చేసి రిజిస్ట్రేషన చేసుకున్నారు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి రావడంతో గత ఏడాది అక్టోబరు 30న రూ.2 కోట్ల ప్రభుత్వ భూమికి టోకరా అన్న కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన కడప తహసీల్దారు శివరామిరెడ్డి స్థలాన్ని పరిశీలించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఆ రిజిస్ట్రేషన రద్దు చేయాల్సిందిగా కలెక్టరు ద్వారా రిజిస్ట్రేషన శాఖకు నివేదిక పంపారు. అలాగే నవంబరు 16న ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డును నాటారు. 


మళ్లీ ఇప్పుడు

కబ్జా చేయాలనే అలవాటు పడ్డ ఆ నేతలు ఇప్పుడు మళ్లీ ఆ భూమిపై కన్నేశారు. కొందరు నేతల నుంచి భరోసా రావడంతో కబ్జారాయుళ్లు హెచ్చరిక బోర్డును తొలగించినట్లు తెలుస్తోంది. ఆ భూమి కబ్జాకు అడ్డంకులు లేకుండా చూస్తామని కొందరు భరోసా ఇవ్వడంతో  ఇప్పుడు మళ్లీ ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టడమా లేక అమ్మేయడమా అన్న ప్లానలో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కబ్జాకు గురికాకుండా అధికారులు అడ్డుకోవడంతో స్థానిక పేదల్లో ఇక ఇంటిస్థలాలు వస్తాయనే ఆశ ఉండేది. అయితే మళ్లీ ఇప్పుడు కబ్జా యత్నం జరుగుతుండడంతో ఇల్లు లేని నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 


అది ప్రభుత్వ భూమి   

- శివరామిరె డ్డి, కడప తహసీల్దారు

గూడూరు రెవెన్యూ పరిధిలోని రామరాజుపల్లె సర్వే నెం.145/1లో 76 సెంట్లు, 146లో 32 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. 146లో ఉన్న భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన చేసుకున్నట్లు గుర్తించి రిజిస్ట్రేషన రద్దు కోసం కలెక్టరు ద్వారా ఆరు నెలల కిందట రిజిస్ట్రేషన శాఖకు సిఫారసు చేశాం. ప్రభుత్వ భూమి అంటూ నోటీసు బోర్డు పాతాం. బోర్డు తొలగించి కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-04-13T05:40:18+05:30 IST