Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ఫోన్‌ మళ్ళీ మోగకూడదు!

ఆంధ్రజ్యోతి(22-04-2020):

రోగులను రక్షించడానికి వైరస్‌తో చెలగాటం ఆడుతున్నామని వారికి తెలుసు! ఒక చిన్న పొరపాటో, నిర్లక్ష్యమో ప్రాణాలను కాటేస్తుందనీ తెలుసు!! మాస్క్‌లు ముఖాల్ని కోసేస్తున్నా, ఆకలీ, దప్పికా ఒంట్లోని శక్తిని మింగేస్తున్నా సహనాన్ని కోల్పోకుండా పోరాడుతున్నారు వారు. అవును... ఆ డాక్టర్లు ఇప్పుడు నిజంగానే మానవత్వం నిండిన దేవుళ్ళు. కష్టాన్నీ, కన్నీటినీ అదిమిపెట్టుకొని, కరోనా బాధితుల సేవలో కర్తవ్యాన్ని సాగిస్తున్న అలాంటి ఒక వైద్య నిపుణురాలి మనోగతం ఇది...


టాయ్‌లెట్‌ సమస్యకు పరిష్కారంగా డైపర్‌ వేసుకుంటాం. అది వేసుకోకుండా ఉండాల్సిందనిపిస్తుంది. కానీ తప్పదు! దానికోసం హుందాతనంతో, మానసిక స్థితితో రాజీ పడాలి.


‘‘కొవిడ్‌-199 వార్డులో నా రాత్రి షిప్ట్‌ ఇప్పుడే పూర్తయింది. అద్దంలో నా ముఖం చూసుకున్నా. నా ముక్కు మీద మాస్క్‌ గుర్తు అచ్చు పడింది. మాస్క్‌ పెట్టుకోవడానికి వాడే ఎలాస్టిక్‌ తాళ్ళ గుర్తులు నా ముఖం మీద లోతుగా ఉన్నాయి. నా కళ్ళు బాగా అలిసిపోయాయి. చెమటతో నా జుట్టు అట్టలు కట్టింది. ఇప్పుడు నేను కేవలం ఓ మహిళా వైద్యురాలిని కాదు, నేను వైద్య యోధురాలిని. నా పోరాటం కరోనా వైరస్‌ మీద!


విమానంలోంచీ దూకే సైనికుడిలా...

నా షిప్ట్‌ మొదలు కావడానికి ముందు రక్షణ కోసం అవసరమైనవన్నీ వేసుకోవాల్సిందే. అవి వేసుకుంటున్నప్పుడు ఎంతో ఉద్విగ్నత! వాతావరణాన్ని తేలిక పరచడం కోసం నా సహోద్యోగులతో ఏదైనా ఛలోక్తిగా మాట్లాడాలని ప్రయత్నిస్తాను. కానీ నన్ను నేను సరిగ్గా రక్షించుకుంటున్నానా? అనే ప్రశ్న ఆలోచనల్లో కదులుతూ ఉంటుంది. ఆ ప్రశ్నతో నాలో బెంగ మొదలవుతుంది. చేతి తొడుగులు, గౌను, రెండో జత చేతి తొడుగులు, కళ్ళద్దాలు, క్యాప్‌, మాస్క్‌, కళ్ళకు అడ్డంగా విజర్‌, షూలు, షూలకు కవర్లు... ఇవన్నీ వేసుకోవాల్సిందే! తరువాత ప్రతిదాన్నీ సీల్‌ చెయ్యడం కోసం టేపుల్తో బిగించాల్సిందే! 


దుస్తులూ, పరికరాలూ ధరించడంలో నాకు సాయపడే మహిళ నా పేరునూ, నేను చేసే విధులనూ సూచిస్తూ నా ల్యాబ్‌ కోటు మీద ఎర్రటి మార్కర్‌తో వివరాలను రాస్తారు. ఎందుకంటే దుస్తులు ధరించిన తరువాత ఎవరు ఎవర్నీ గుర్తుపట్టలేం. ‘అయిపోయింది’ అని ఆమె చెప్పిన తరువాత, వార్డులోకి ప్రవేశిస్తాను. అప్పుడు నా పరిస్థితి విమానంలోంచీ కిందికి దూకే సైనికుడిలా ఉంటుంది. పారాచూట్‌ తెరుచుకోవాలని సైనికుడు కోరుకున్నట్టే, నా మాస్క్‌, నా విజర్‌ నన్ను రక్షిస్తాయనీ, నా చేతి తొడుగులు చిరిగిపోవనీ, ప్రమాదకరమైనవేవీ నా చర్మానికి అంటుకోవనీ నేను ఆశించాలి. తప్పదు! 


అలా... మొక్కుకుంటూ ఉంటాను!

వార్డులోకి నడుస్తున్నప్పుడు ఒక నీటి బుడగలో ప్రవేశిస్తున్నట్టుంటుంది. శబ్దాలన్నిటినీ భారీ యంత్రాలు నిరోధిస్తాయి. పది పదిహేను నిమిషాలు ఏదీ నాకు కనిపించదు. నా ఊపిరి వేడి ఆవిరి నా ముఖానికి పెట్టుకున్న విజర్‌ని కమ్మేస్తుంది. కాసేపటికి ఆ వాతావరణానికి అలవాటు పడిన తరువాత అంతా మసకమసగ్గా కనిపించడం మొదలవుతుంది. షూ కవర్లు ఊడిపోకూడదని కోరుకుంటూ ముందుకు నడుస్తాను. నా షిప్ట్‌ మొదలవుతుంది. 


నా ముందు షిప్ట్‌లో పని చేసిన వాళ్ళ నుంచీ ఆదేశాలు తీసుకుంటాను. ఆసుపత్రిలో కొత్తగా చేరుతున్న కరోనా బాధితుల గురించి ప్రత్యేక ఆదేశాలను వైద్య శాఖ ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌ ఫోన్‌ ద్వారా చెబుతూ ఉంటారు. ఆ ఫోన్‌ మోగకూడదనీ, ఆసుపత్రిలో చేరే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండకూడదనీ మనసులోనే దేముడికి మొక్కుకుంటూ ఉంటాను. ఎవరు ఏ పని చెయ్యాలో నేనూ, నా సహోద్యోగులూ నిర్ణయించుకుంటాం. రోగుల దగ్గరకు వెళ్తాను. నిన్నటి వరకూ పరిస్థితి విషమంగా ఉందనుకున్న యువకుడు కోలుకుంటూ ఉంటాడు. ఒక వయోధికుడు క్రమక్రమంగా మరణానికి దగ్గరవుతూ ఉంటారు. ఆయన ప్రాణాలను నిలబెట్టడానికి నర్స్‌ పోరాడుతూ ఉంటారు. ఆసుపత్రిలో ఒక నర్స్‌కు అనారోగ్యం చేస్తుంది. రెండు వారాల కిందటి వరకూ మా వార్డులో పని చేసిన వాళ్ళు కనిపించరు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతీదీ ఎంత త్వరగా మారిపోయిందో తలచుకుంటే ఆశ్చర్యం, భయం కలుగుతాయి. గంటలు గడుస్తున్న కొద్దీ నా ముక్కు నొప్పి పెడుతోంది. మాస్క్‌ నా చర్మాన్ని కోసేస్తోంది. దాన్ని పైకి తీసి, గట్టిగా ఊపిరి తీసుకోవాలనిపిస్తోంది. ఈ రోజుల్లో వైద్యులు, రోగులు, నర్సులూ, ఆరోగ్య కార్యకర్తలూ... అందరం కోరుకొనేది ఒక్కటే... మాకు గాలి కావాలి. గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి!


కన్నీళ్ళు దాచుకుంటున్నా!

నా షిఫ్టు చివరికి వచ్చేసింది. సుదీర్ఘమైన ఎనిమిది గంటల పని. మామూలు రోజుల్లో ఇది ఇబ్బంది కాదు, కానీ ఇప్పుడు రెండింతల సేపు పని చేస్తున్నట్టుంది. దాహంతో, ఆకలితో ఆ సమయం పదింతల్లా అనిపిస్తోంది. షిఫ్టులో ఉన్నప్పుడు ఏదీ తినలేం, తాగలేం! ఆఖరికి బాత్‌రూమ్‌కి కూడా వెళ్ళడం కుదరదు. అలా వెళ్ళాలంటే ఒంటి నిండా కప్పుకొన్న ‘వ్యక్తిగత రక్షణ తొడుగు’ను (పి.పి.ఇ. కిట్‌) తొలగించాల్సి ఉంటుంది. అది ప్రమాదం! పైపెచ్చు ఖరీదైన వ్యవహారం! రక్షణకోసం మేము ధరించే ఈ తొడుగులు చాలా విలువైనవి. వాటిని ఒకసారి తీసేస్తే కొత్తవి వేసుకోక తప్పదు. అలా నేను మాటిమాటికీ కొత్తవి వేసుకోవాలంటే నాతో పనిచేసేవాళ్ళకి సరిపోయేటన్ని పి.పి.ఇ. కిట్లు లేవు. అందుకే దాహం వేస్తే ఆపుకోవాలి. టాయ్‌లెట్‌ సమస్యకు పరిష్కారంగా డైపర్‌ వేసుకుంటాం. అది వేసుకోకుండా ఉండాల్సింద నిపిస్తుంది. కానీ తప్పదు! దానికోసం హుందాతనంతో, మానసిక స్థితితో రాజీ పడాలి. ఇక రోగుల ముఖాల్లోకి చూసినప్పుడూ, రోగుల బంధువులతో మాట్లాడి, రోగుల పరిస్థితి గురించి వాళ్ళకు చెప్పాల్సివచ్చినప్పుడూ కష్టంగా ఉంటుంది. ఒకరు తల్లి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పమంటారు. మరికొందరు తల్లితండ్రులనూ, కుటుంబ సభ్యులనూ తాము ఎంత ఇష్టపడుతున్నామో వారికి చెప్పమంటారు. బంధువులకు కృతజ్ఞతలు చెప్పమని రోగులు దీనంగా అడుగుతూ ఉంటారు. ఇక రోగుల ఆరోగ్య పరిస్థితి ఏమిటని వారి సన్నిహితులు ఆత్రుతతో ఆరా తీస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతాయి. కదిలే ఆ కన్నీటిని నా సహోద్యోగులకు కనిపించకుండా దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అది అంత సులభం కాదు.


రెండు వారాల కిందటి వరకూ మా వార్డులో పని చేసిన వాళ్ళు కనిపించరు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతీదీ ఎంత త్వరగా మారిపోయిందో తలచుకుంటే ఆశ్చర్యం, భయం కలుగుతాయి.


(ఇటలీకి చెందిన డాక్టర్‌ సిల్వియా కాస్టెల్లెట్టీ పంచుకున్న కరోనా కాలపు అనుభవం ఇది)

Advertisement
Advertisement