కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ రామ ప్రసాద్ శంకర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 11న విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు సజావుగా లేని సంగతి తెలిసిందే.
మమత బెనర్జీ ఇటీవల తన ట్విటర్ ఖాతాలో గవర్నర్ ధన్‌కర్‌ను బ్లాక్ చేశారు. ఆయన తన ప్రభుత్వాన్ని వెట్టి కార్మికురాలిగా పరిగణిస్తున్నారని, ఆయన ట్వీట్లు తనను డిస్టర్బ్ చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్ భవన్ నుంచి పెగాసస్‌తో నిఘా జరుగుతోందని ఆరోపించారు. ఫోన్లు తరచూ ట్యాప్ అవుతున్నాయన్నారు.
ఇదిలావుండగా, సమాచార కమిషనర్లుగా మాజీ డీజీపీ వీరేంద్ర, మాజీ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ ప్రకాశ్‌లను నియమించాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ సిఫారసు లోపభూయిష్టమని గవర్నర్ ధన్‌కర్ పేర్కొన్నారు.
మరోవైపు ఓ సీనియర్ పోలీసు అధికారితో మమత బెనర్జీ మాట్లాడుతూ, ‘‘మిమ్మల్ని గవర్నర్ బెదిరిస్తున్నారా? మీ విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నారా?’’ అని అడిగినట్లు ధన్‌కర్‌కు తెలిసింది. దీంతో ఆయన ఆమెపై మండిపడ్డారు. ఆమె చర్యలు అత్యంత తీవ్రమైనవని ధన్‌కర్ ఆరోపించారు. గవర్నర్ రాజ్యాంగ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని టీఎంసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి