రైతు భరోసా కేంద్రానికి చేరిన అమూల్ పాలసేకరణ పరికరాలు
రేపటి నుంచి పాల సేకరణ
తొలి దశలో 9 మండలాలు ఎంపిక
191 రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాట్లు
ఒక్కో కేంద్రంలో రోజుకు కనీసం 80 లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యం
ఇంతవరకు పాల సేకరణ ధరలు ప్రకటించని వైనం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అమూల్ పాల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా అమూల్ డెయిరీకి పాలు సేకరించేందుకు పశు సంవర్థక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలు ఉండగా.. తొలి దశలో తొమ్మిది మండలాల్లో మాత్రమే అమూల్‌కు పాల సేకరణ చేయనున్నారు. ఈ మేరకు అనకాపల్లి, నక్కపల్లి, ఎలమంచిలి, అచ్యుతాపురం, కశింకోట, చోడవరం, కె.కోటపాడు, మునగపాక, పరవాడ మండలాల్లో 191 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు అమూల్ సంస్థ సరఫరా చేసిన తూనిక యంత్రం, క్యాన్‌లు, కంప్యూటర్, ఇతర పరికరాలను అందజేశారు. పాల సేకరణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ప్రతి కేంద్రం నుంచి రోజూ కనీసం 80 లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాల సేకరణకు 21 రూట్లను గుర్తించి, వాహనాలను సిద్ధం చేశారు. సేకరించిన పాలను అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన బల్క్ కూలింగ్ సెంటర్‌కు తరలిస్తారు.
పాల సేకరణ ధరలు ఇంకా నిర్ణయించలేదు
బి.ప్రసాదరావు, జేడీ, పశుసంవర్థ శాఖ, అనకాపల్లి
అమూల్‌కు పాల సేకరణ ద్వారా పాడి రైతుల ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. శుక్రవారం నుంచి పాల సేకరణ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. పాల సేకరణ ధరలను ఇంకా నిర్ణయించలేదు. మిగిలిన డెయిరీలకన్నా ఎక్కువ ధర చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.