అమృత పాణి.. భలే బోణి

ABN , First Publish Date - 2021-02-25T05:36:17+05:30 IST

రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అమృతపాణి పంటకు భలే డిమాండ్‌ ఏర్పడింది. అమృత పాణి పంటను సాగు చేయడానికి రైతులు మక్కువ చూపుతున్నారు. మూడేళ్లుగా ఈ సాగు జోరందుకుంది. మూడేళ్ల కిందట వెయ్యి ఎకరాల్లో మొదలైన ఈ అమృత పాణి అరటిసాగు నేడు 5 వేల ఎకరాలకు చేరుకుంది.

అమృత పాణి.. భలే బోణి
మిట్టమీదపల్లె ప్రాంతంలో విరివిగా సాగు చేసి వున్న అమృతపాణి అరటి

ఎకరాకు లక్ష ఆదాయం 

రెండేళ్లలోనే రెట్టింపైన సాగు 

అమృతపాణి వైపు రైతుల చూపు

రాజంపేట, ఫిబ్రవరి 24 : రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అమృతపాణి పంటకు భలే డిమాండ్‌ ఏర్పడింది. అమృత పాణి పంటను సాగు చేయడానికి రైతులు మక్కువ చూపుతున్నారు. మూడేళ్లుగా ఈ సాగు జోరందుకుంది. మూడేళ్ల కిందట వెయ్యి ఎకరాల్లో మొదలైన ఈ అమృత పాణి అరటిసాగు నేడు 5 వేల ఎకరాలకు చేరుకుంది. అరటిపంటలో అమృతపాణికి మంచి గిరాకీ ఉంది. ఈ కాయలు నాణ్యతతో పాటు రుచికరంగా, ఎక్కువ రోజులు మన్నిక ఉండటంతో వీటికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. పిలక నాటిన తరువాత 14 నెలలకు గెల చేతికొస్తుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పిలకలు నాటుతారు. మరుసటి ఏడాది అనగా 14 నెలలకు పంట చేతికొస్తుంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ పంట బాగా పండుతుంది. ఒక ఎకరాకు 900 పిలకలు నాటుతారు. ఒక్కో చెట్టు 30 అడుగుల పైబడి పెరుగుతుంది. ఎంతో ఏపుగా పెరిగే ఈ అమృతపాణి సుమారు 25 కిలోల వరకు బరువుండే గెలలను వేస్తుంది. ఒక్కో గెల రూ.400 నుంచి డిమాండ్‌ను బట్టి రూ.600కు అమ్ముడుపోతుంది. ఈ విధంగా ప్రతి ఎకరాకు వేసే 900 చెట్లకు రమారమి ఖర్చులు పోనూ లక్ష రూపాయలు పైబడి ఆదాయం వస్తోంది. ఎక్కువగా ఈ పంటను నెల్లూరు, చెన్నై, ముంబై ఇతర దేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. తెగుళ్లు తక్కువగా సోకడం, ఇతర అరటి పంటల కంటే ఎక్కువ ధర పలకడం వలన ఈ పంటకు మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. ఒక్కో కిలో సీజన బట్టి 14 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతాయి. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని మిట్టమీదపల్లె, కొల్లావారిపల్లె, బావికాడపల్లె, కూచివారిపల్లె, ఆకేపాడు, పులపత్తూరు, గాదెల, వెంకటరామాపురం, జంగిటివారిపల్లె, మైసూరువారిపల్లె, శెట్టిగుంట, చిన్నఓరంపాడు, పెద్దఓరంపాడు, చిట్వేలి, నాగవరం, నగరిపాడు, మల్లెంపల్లె, ఎగువపల్లె తదితర అనేక గ్రామాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పచ్చ అరటిని ఎక్కువగా సాగు చేసేవారు. అయితే పచ్చ అరటికి పులివెందుల అరటి పోటీగా ఉంటుంది. రాజంపేట ప్రాంతంలో సాగు చేసే పచ్చ అరటిపంట కంటే పులివెందుల అరటి మంచి మన్నికగా ఉండటం వల్ల అక్కడి పంటకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. పచ్చ అరటి డిమాండ్‌ ఒక్కొక్కసారి కుదేలవుతూ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో పచ్చ అరటిని సాగు చేయడం వల్ల పెద్ద గిరాకీ ఉండదు. అక్కడక్కడా సాగు చేసే అమృతపాణి కాయలు ఎంతో రుచికరంగా మన్నికగా ఉండటం వల్ల వీటికి గిరాకీ ఉంది. ప్రస్తుతం మూడు నెలలుగా అమృతపాణి పంటకు మంచి డిమాండ్‌ ఉంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు ప్రస్తుతం ఈ పంట మంచి లాభాలను గడిస్తోంది. 


ఎకరాకు లక్ష పైబడి ఆదాయం 

-కావటూరి సుబ్రహ్మణ్యంనాయుడు, రైతు, రాజంపేట 

నేను 22 ఎకరాల్లో అమృతపాణి పంటను సాగు చేస్తున్నాను. మామూలుగా ఈదురుగాలులు మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ పంటను ప్రతి ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో వేయడం వల్ల మరుసటి ఏడాది అంటే 14 నెలలకు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో గెలలు వేస్తాయి. ఆ సీజనలో గాలులు తక్కువ. అందువల్ల పంట పడిపోవడానికి వీలుండదు. ఈ సమయంలో ఈ కాయలకు కూడా మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం నేను 22 ఎకరాల్లో సాగు చేస్తున్న అరటి పంటకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎకరాకు 60 వేలు ఖర్చు అవుతుంది. ఖర్చులకు పోనూ లక్ష తక్కువ లేకుండా ఆదాయం వస్తోంది.

Updated Date - 2021-02-25T05:36:17+05:30 IST