గిద్దలూరులో అమీతుమీ

ABN , First Publish Date - 2022-05-23T05:11:31+05:30 IST

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీలో మొదలైన వర్గపోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. అసంతృప్తి సెగలు మరింత ఎగసిపడుతున్నాయి. ఈనెలలోనే రెండో పర్యాయం ఆపార్టీలోని అసంతృప్తివాదులుగా ఉన్న నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యవహార శైలిపై ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డిలను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు స్పందించకపోతే అమీతుమీకి సిద్ధమవ్వాలని తీర్మానించుకున్నారు.

గిద్దలూరులో   అమీతుమీ
సంజీవరాయునిపేటలోని ఓ జామాయిల్‌ తోటలో సమావేశమైన వైసీపీ అసంతృప్తి నేతలు

నెలలో రెండోసారి వైసీపీ 

అసమ్మతి నేతల సమావేశం 

పెరిగిన ఎమ్మెల్యే రాంబాబు వ్యతిరేకులు 

సజ్జల, బాలినేని వద్దకు వెళ్లి 

గోడు వినిపించాలని నిర్ణయం 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీలో మొదలైన వర్గపోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. అసంతృప్తి సెగలు మరింత ఎగసిపడుతున్నాయి. ఈనెలలోనే రెండో పర్యాయం ఆపార్టీలోని అసంతృప్తివాదులుగా ఉన్న నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యవహార శైలిపై ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డిలను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు స్పందించకపోతే అమీతుమీకి సిద్ధమవ్వాలని తీర్మానించుకున్నారు. 

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యే రాంబాబుపై అసంతృప్తులు పెరగటం, తదనుగుణంగా పలువురు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీన రాచర్ల మండల పరిధిలోని ఒక తోటలో ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గిద్దలూరు జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్‌ యాదవ్‌తోపాటు గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు. తిరిగి ఆదివారం ఉదయం ఈ అసంతృప్త వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరోసారి భేటీ అయ్యారు. గిద్దలూరు, రాచర్ల మండలాలతోపాటు కొమరోలు మండలానికి చెందిన వైసీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన కిందిస్థాయి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, గిద్దలూరు మండలంలోని పొదలకుంటపల్లి సర్పంచ్‌ కుమారుడు, సంజీవరాయునిపేట సర్పంచ్‌, ఆదిమూర్తిపల్లె, అంబవరం మాజీసర్పంచ్‌లతోపాటు కొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సత్యవోలు సర్పంచ్‌ బాల ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్‌ రంగస్వామిరెడ్డి, జేపీ చెరువు, పలకలవీడు, అడవల్లి, రాచర్ల తదితర గ్రామాలకు చెందిన పలువురు ముఖ్యనేతలూ హాజరయ్యారు. కొమరోలు మండలంలో ఇప్పటికే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసిన ఓ ఇద్దరు ముఖ్య నాయకుల సహకారం కూడా వీరికి పరోక్షంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ సమస్యలపై అధిష్ఠానం స్పందించకపోవడాన్ని సమావేశంలో నాయకులు చర్చించుకున్నట్లు తెలిసింది. త్వరలో పరిస్థితిని సజ్జల, బాలినేనికి వివరించాలని అప్పటికీ వారు స్పందించకపోతే రాజకీయ భవితవ్యానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-05-23T05:11:31+05:30 IST