అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధి : అమిత్ షా

ABN , First Publish Date - 2022-04-21T19:07:15+05:30 IST

అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధిని సిద్ధం చేసేందుకు కృషి జరుగుతోందని

అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధి : అమిత్ షా

న్యూఢిల్లీ : అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధిని సిద్ధం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదానికి నిధులు, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు, హవాలా, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటివాటికి సంబంధించిన సమాచారంతో ఈ నిధిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. కేసుల దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, పోలీసులకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 13వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా గురువారం అమిత్ షా మాట్లాడారు. 


ఉగ్రవాద కేసుల దర్యాప్తు, నిందితులు దోషులుగా నిర్థరణ కావడానికి ఉగ్రవాదంపై సమాచార నిధి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ నిధిని సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఏ సమాచారమైనా, దానిని గుప్తంగా ఓ చోట ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఆ సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చి, పుచ్చుకుంటే, దానిని సక్రమంగా విశ్లేషిస్తే, దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. గడచిన 13 ఏళ్ళలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేసిన  ఉగ్రవాద సంబంధిత కేసుల్లో దోషిత్వ నిర్థరణ రేటు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 


అంతర్జాతీయ స్థాయికి... 

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుతున్న సంఘటనలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఎన్ఐఏ పనితీరును ప్రశంసించారు. కశ్మీరు లోయలో క్షేత్ర స్థాయిలో వర్కర్ నెట్‌వర్క్‌ను,  ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఇది దోహదపడిందన్నారు. అతి తక్కువ సమయం (13 సంవత్సరాలు)లోనే ఎన్ఐఏ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. ఉగ్రవాదానికి నిధులు, ఉగ్రవాదంపై దర్యాప్తు, మావోయిజానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం ఎంతో శ్రమిస్తోందన్నారు. 


అన్ని విధాలుగా సహకారం

భారత దేశాన్ని ఉగ్రవాద రహితం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎన్ఐఏకి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యాంటీ టెర్రర్ దర్యాప్తు సంస్థలకు సహకరించాలని ఎన్ఐఏను కోరారు. 


పని తీరు భేష్

2008 నవంబరు 26న ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2009లో ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి 400కుపైగా కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. వీటిలో దోషిత్వ నిర్థరణ జరిగిన కేసులు 93 శాతం వరకు ఉన్నాయి. 


Updated Date - 2022-04-21T19:07:15+05:30 IST