ఆ పాలపొడిని గర్భిణులకు ఇవ్వలేం

ABN , First Publish Date - 2022-06-07T13:17:10+05:30 IST

ఆవిన్‌ పాలపొడిలో తగినన్ని పోషకాలు లేనందునే వాటిని గర్భిణులకు పంపిణీ చేయలేమని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం పేర్కొన్నారు. గర్భిణులకు ప్రభుత్వం అందజేసే

ఆ పాలపొడిని గర్భిణులకు ఇవ్వలేం

- పౌష్టికాహారంలో అక్రమాలకు తావులేదు

- అన్నామలై ఆరోపణలపై మంత్రి సుబ్రమణ్యం వివరణ 


చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆవిన్‌ పాలపొడిలో తగినన్ని పోషకాలు లేనందునే వాటిని గర్భిణులకు పంపిణీ చేయలేమని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం పేర్కొన్నారు. గర్భిణులకు ప్రభుత్వం అందజేసే హెల్త్‌కిట్‌లో ఆవిన్‌కు బదులుగా ప్రైవేట్‌ సంస్థల పాలపొడిని కొనుగోలు చేసేందుకు టెండర్లు కేటాయించారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. సోమవారం ఉదయం ఓమందూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం టెండర్లను కేటాయించకముందే ప్రైవేటుసంస్థలకు టెండర్లను ఖరారు చేశారంటూ అన్నామలై ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆవిన్‌ తయారు చేసే పాలపొడి టీ, కాఫీలో కలుపుకునేందుకే ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 2018 నుంచి గర్భిణీలకు హెల్త్‌కిట్లను పంపిణీ చేస్తున్నారని, ప్రస్తుతం ఆ కిట్లకు సంబంధించిన పాలపొడి, ఐరన్‌ సిరఫ్‌, విటమిన్ల మాత్రలు, ఖర్జూరాలు తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు టెండర్లను పిలిచామని, అయితే అవి ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రో-బీఎల్‌ హెల్త్‌ మిక్స్‌ పౌడర్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నామని, ఆ హెల్త్‌మిక్స్‌ పౌడర్‌ గర్భిణులకు పోషకపదార్థాలను మెండుగా సమకూర్చుతుందని ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించాయని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ఆ హెల్త్‌మిక్స్‌ పౌడర్‌ రూ.588లకు విక్రయిస్తుండగా, ప్రభుత్వం రూ.460లకే కొనుగోలు చేసేలా టెండర్లను పిలిచిందని ఆయన వివరించారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈ హెల్త్‌ మిక్స్‌ పౌడర్‌ కొనుగోలుకు రూ.450 కోట్ల మేర టెండర్లను  ఖరారు చేసినట్లు అన్నామలై ఆరోపించడం గర్హనీయమన్నారు. మీడియా సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వ వినాయగం, వైద్యసేవా సంస్థ సంచాలకులు డాక్టర్‌ దీపక్‌ జాకబ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T13:17:10+05:30 IST