విశ్వ విజ్ఞానానికి ప్రతీక అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2021-04-17T06:46:25+05:30 IST

విశ్వ విజ్ఞానానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ అని ఎంజీయూ రిజిస్ర్టార్‌ ప్రొ. విష్ణుదేవ్‌ అన్నారు.

విశ్వ విజ్ఞానానికి ప్రతీక అంబేడ్కర్‌
అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రిజిస్ర్టార్‌

నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 16 : విశ్వ విజ్ఞానానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ అని ఎంజీయూ రిజిస్ర్టార్‌ ప్రొ. విష్ణుదేవ్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అంబేడ్కర్‌ జీవితమంతా అణచివేయబడిన వర్గాల అభ్యున్నతికి పోరాడారన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి రూపకర్త అని, దేశాన్ని పటిష్టం చేయడమే ఆయన ఉద్దేశమన్నారు. కుల అసమానతలతో జన్మించి వాటి పరిష్కారాల కోసం అధ్యయనం, పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రొ. సుధారాణి మాట్లాడుతూ స్త్రీల హక్కుల కోసం పోరాడానికి ఆయన ప్రతీక అన్నారు. ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ లండన్‌లోని బ్రిటీష్‌ కౌన్సిల్‌లో 16వేల పుస్తకాలను అధ్యయనం చేసి 16డిగ్రీలు పూర్తి చేసిన విద్యావేత్త అంబేద్కర్‌ అన్నారు. అందుకే యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ ఆయన జన్మదినాన్ని విశ్వ విజ్ఞాన దివ్‌సగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోనే ఆయన్ని విముక్తి దాతగా ఆదర్శంగా చేసుకుని హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:46:25+05:30 IST