రణరంగంగా అంబేడ్కర్‌ బస్తీ

ABN , First Publish Date - 2022-07-23T16:39:36+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ నెరవేరకపోవడంతో బస్తీ వాసులు కన్నెర్ర చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్న స్థలంలోనే

రణరంగంగా అంబేడ్కర్‌ బస్తీ

 ‘డబుల్‌ ఇళ్లు’ పూర్తి కాకపోవడంతో సొంతంగా 

ఇళ్ల నిర్మాణానికి యత్నం

 కూల్చివేతలకు సిద్ధమైన రెవెన్యూ సిబ్బంది

 ఎదురు తిరిగి.. రాళ్లు రువ్విన బస్తీ వాసులు

 అధికారులు, సిబ్బంది పరుగులు.. ఉద్రిక్తత


హైదరాబాద్/బంజారాహిల్స్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ నెరవేరకపోవడంతో బస్తీ వాసులు కన్నెర్ర చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్న స్థలంలోనే ఎవరికి వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధం కాగా, అధికారులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రెవెన్యూ, పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన బస్తీ వాసులు.. ఒక దశలో రాళ్ల దాడికి పాల్పడడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ బస్తీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 46లోని అంబేడ్కర్‌ బస్తీలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు  25 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టాలని 2015లో ప్రతిపాదించారు. మొదట బస్తీ వాసులు వ్యతిరేకించినా... చివరకు అధికారుల హామీతో అంగీకరించారు. ఈ మేరకు 152 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు.. తాత్కాలికంగా గుడిసెలను ఓ పక్కన వేసుకునేలా అవకాశం ఇచ్చారు. మూడు బ్లాక్‌లుగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన జరిగినప్పటి నుంచీ అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. గత ఆరేళ్లలో మొదటి బ్లాక్‌లో స్లాబ్‌ పనులు మాత్రమే పూర్తి చేశారు.


ఇంకా 70 శాతం పని మిగిలి ఉంది. మిగతా రెండు బ్లాక్‌ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయిన బస్తీ వాసులు.. స్వయంగా తామే ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. కొందరు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడంతో షేక్‌పేట తహసీల్దార్‌ రామకృష్ణ, సిబ్బంది శుక్రవారం ఉదయాన్నే కూల్చివేతల కోసం ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అధికారులతో బస్తీవాసులు వాగ్వావాదానికి దిగి, రాళ్లు రువ్వారు. దీంతో రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరకు పోలీసులు తమదైన శైలిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విషయం తెలియగానే కార్పొరేటర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు పి.విజయారెడ్డి అక్కడకు చేరుకుని, బైఠాయించారు. ఇంతలో బీజేపీ నేత గౌతమ్‌రావు తదితరులు అక్కడకు వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించి.. పంపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. ఓ అధికారి చేసిన పొరపాటును విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయమై మంత్రి తలసాని, కలెక్టర్‌, కార్పొరేటర్లతో మాట్లాడిన తర్వాత బస్తీ వాసులతో ఆయన చర్చలు జరిపారు. జీవో 58 కింద ఆ స్థలాన్ని రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-07-23T16:39:36+05:30 IST