నమ్మించి మోసం చేశారు

ABN , First Publish Date - 2022-09-28T06:10:52+05:30 IST

అమరావతిని స్వాగతిస్తున్నామని నమ్మబలికి పాలకులు మోసం చేశారని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మించి మోసం చేశారు
బిల్డ్‌ అమరావతి, హైకోర్టు తీర్పును అమలు చేయాలని నినాదాలు చేస్తున్న వెలగపూడి ధర్నా శిబిరంలోని రైతులు

1015వ రోజుకు  చేరుకున్న అమరావతి ఆందోళనలు 

తుళ్లూరు, సెప్టెంబరు 27: అమరావతిని స్వాగతిస్తున్నామని నమ్మబలికి పాలకులు మోసం చేశారని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టటానికే మూడు రాజధానుల ప్రకటన అని పేర్కొన్నారు.  బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 1015 వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, రాష్ట్రం చిన్నదైపోయింది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పడాలని, అందుకు 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా  ఆనాటి ప్రతిపక్ష నాయకుడు , నేటి ఎపీ  సీఎం జగన్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన తరువాత అమరావతిని నాశనం చేయటమే  పనిగా పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపులో ఇంత కక్ష పెట్టుకుంటారని ఊహించలేక పోయామన్నారు.  అధికారంతో కూడు కున్న అహంకారం ఎప్పటికైనా చేటనన్నారు. ఆ దిశగానే వైసీపీ సర్కార్‌ వెళుతోందన్నారు. ఎప్పటికీ ఆంధ్రుల రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పు సారాంశం కూడా అదేనన్నారు.  తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి ఇప్పటికే పాల్పడ్డారన్నారు. ధిక్కార శిక్ష నుండి తప్పించుకోవటానికి సీఆర్డీఏ చట్ట సవరణ పెట్టారన్నారు.  ఒక సారి క్యాపిటల్‌ ఆమోదం ప్రభుత్వం చేశాక మార్చటం కుదరదని చట్టమే చెపుతుందన్నారు. మూడు రాజధానులు , 30 రాజధానులని రాజ్యాంగంలోనే లేదన్నారు. ఉన్నది ఒకటే రాజధాని అన్నారు. ఆ నిర్ణయం జరిగిపోయిందన్నారు. ఆరేళ్ల నుండి రాష్ట్ర రాజధానిగా అమరావతి నుండి పాలన జరుగుతుందన్నారు. సీఎం కోర్టు తీర్పును అమలు చేయకుండా అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారన్నారు.  ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి, హైకోర్టు తీర్పును అమలు చేసి రాష్ట్ర  ఏకైక రాజధానిగా అమరావతి అని ప్రకటించి  అభివృద్దిని కొనసాగించాలన్నారు. లేదంటే  రాజ్యాంగ బద్దంగా ప్రజలు ఎన్నుకొని పదవులలో ఉన్న వారు రాజీనామాలు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం వేళ  జై అమరావతి, బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి  రైతులు, మహిళలు, రైతు కూలీలు నినాదాలు చేశారు. పాద యాత్రను అడ్డుకోవాలని అడుగు అడుగునా ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలకు రాష్ట్ర రాజధాని అమరావతి ఆవశ్యకత అర్థమవటంతో తండోపతండాలుగా పాద యాత్రకు మద్దతు పలకటానికి వస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-28T06:10:52+05:30 IST