మాది ధర్మపోరాటం

ABN , First Publish Date - 2020-08-03T12:26:53+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు..

మాది ధర్మపోరాటం

గుంటూరు(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు ఆదివారం 229వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, మందడం గ్రామాల్లోని దీక్ష శిబిరాల్లో రైతులు, మహిళలు పాల్గొన్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడకలో నిరసనలు మిన్నంటాయి. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. బేతపూడి గ్రామ రైతులు ప్లకార్డులు చేతబట్టి నినదించారు. తుళ్లూరు, వెలగపూడి దీక్షా శిబిరాలను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. గుంటూరులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కరోనా నేపథ్యంలో శిబిరాల్లో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళనలు నిర్వహించారు. 


జేఏసీ ప్రతినిధుల హౌస్‌ అరెస్ట్‌

మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతాయని సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడలో గృహ నిర్బంధాలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహించే ప్రతినిధులను ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టనీయలేదు. శనివారం రాత్రే జేఏసీ నేతల ఇళ్లకు నోటీసులు పంపారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే ఇళ్ల ముందు పోలీస్‌ పహారా ఏర్పాటుచేశారు. దీంతో ఎక్కువ మంది నిరసనకారులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. 


మహిళా జేఏసీ ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ శవయాత్ర

మహిళా జేఏసీ నేతలు సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, గద్దె అనురాధ తదితరులు ఆటోనగర్‌లోని జేఏసీ కార్యాలయంలో శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి పాడికట్టి అక్కడే ఊరేగించారు. దహన సంస్కారాలు నిర్వహించారు. హనుమాన్‌పేటలో దాసరి భవన్‌ వద్ద సీపీఐ నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కొవిడ్‌ నిబంధనల పేరుతో తమ నిరసనలను అడ్డుకోవడంపై మహిళా జేఏసీ నాయకురాలు అంజని యలమంచిలి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వెలగపూడి శంకరబాబు తన ఇంటి నుంచే నిరసన కార్యక్రమం నిర్వహించారు. 


ఆగిన రైతు గుండె

మంగళగిరి క్రైమ్‌ : మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంతో అమరావతి నిర్మాణానికి తన పంట పొలాన్ని ఇచ్చిన ఓ రాజధాని రైతు గుండె ఆగింది. నీరుకొండ గ్రామానికి చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు(59) తనకున్న రెండెకరాల భూమిని అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. రాజధాని గ్రామ రైతులు చేపట్టిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీయే రద్దు, మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంతో తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. శనివారం నీరుకొండలో జరిగిన రైతుల ఆందోళనలో పాల్గొన్న వెంకటేశ్వరరావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రాజధాని పరిరక్షణ సంఘం నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


Updated Date - 2020-08-03T12:26:53+05:30 IST