అమరావతిపై ప్రభుత్వం కపట ప్రేమ

ABN , First Publish Date - 2021-02-25T06:40:33+05:30 IST

రాజధాని అమరావతిపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని రైతులు, మహిళలు పేర్కొన్నారు.

అమరావతిపై ప్రభుత్వం కపట ప్రేమ
పెనుమాకలో నిరసన దీక్షలో పాల్గొన్న రైతులు

 ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే నమ్మాలా?

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి

435వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, ఫిబ్రవరి 24: రాజధాని అమరావతిపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని రైతులు, మహిళలు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతవాసులు చేపట్టిన ఆందోళనలు బుధవారం 435వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  రాజధాని రైతులు ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా రాజధానిలో భవనాల నిర్మాణాలు చేపట్టాలని భావించడం వెనుక కుట్రదాగి ఉందన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాతనే నిర్మాణాలు పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబితే తాము హర్షిస్తామన్నారు. మా భూములపై రూ3వేల కోట్లు అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తామంటే నమ్మబోమన్నారు. వెలగపూడి, మందడం ధర్నా శిబిరాల్లో దళిత జేఏసీ సభ్యులు పాల్గొని జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉద్దండ్రాయునిపాలెం  శిబిరంలో నిరాహార దీక్ష చేపట్టిన అఖిల్‌, రాములకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. రాత్రి ఏడు గంటలకు అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల దీక్షలు కొనసాగాయి.  


Updated Date - 2021-02-25T06:40:33+05:30 IST