Abn logo
Mar 2 2021 @ 01:14AM

ఇంటిపోరు..

  ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టిక్కెట్‌ దక్కని వారు రెబల్స్‌గా బరిలోకి

  పోటీ నుంచి తప్పుకోవాలంటే షరతులతో కూడిన డిమాండ్లు

  పగలు ప్రచారం, రాత్రి రెబల్‌ అభ్యర్థుల బుజ్జగింపుల్లో తలమునకవలవుతున్న నేతలు

  పూర్వవైభవంతో టీడీపీ

  పంచాయతీల్లో గెలుపు ధీమాతో వైసీపీ

(కాకినాడ/అమలాపురం, ఆంధ్రజ్యోతి)  మునిసిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగుస్తుంది. అయితే ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కని వారు రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. వీరిని పోటీ నుంచి విరమింపజేయడానికి నాయకులు అపసోపాలు పడుతున్నారు. తాము తప్పుకోవాలంటే గతంలో చేసిన ఖర్చు వెనక్కు ఇచ్చి కౌన్సిల్‌లో మెజారిటీ సాధిస్తే కో-ఆప్షన్‌ సభ్యత్వంతో పాటు తమను అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించాలని రెబల్స్‌ డిమాండ్‌ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారికంగా టికెట్‌ ఇచ్చిన అభ్యర్థుల తరపున పగలు ఎన్నికల ప్రచారంలో, రాత్రుళ్లు రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలో నాయకులు తలమునకలవుతున్నారు. అయితే పురపోరులో పూర్వ వైభవం కోసం టీడీపీ, పంచాయతీల్లో గెలుపుతో విజయం సాధిస్తామనే ధీమాతో వైసీపీ నేతలు ఎవరి అంచనాలో వారున్నారు. గతంలో టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలవడానికి వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. వీరితో సమానంగా రెబల్స్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే చివరి సమయంలో తమకు ఆయా పార్టీల అధిష్ఠానాలు టికెట్‌ ఖరారు చేయదని భావిస్తున్న రెబల్స్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి తెరపైకి డిమాండ్లు తెస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికలను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతీ ఓటు కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో రెబల్స్‌ ఓట్లు చీల్చితే ప్రభావం తమ పార్టీలపై పడుతోందనే భావన వ్యక్తమవుతున్న తరుణంలో టీడీపీ, వైసీపీ నాయకులు ఆచితూచి అడుగేస్తున్నారు. రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకోడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 

ఉదాహరణకు సామర్లకోట మునిసిపాలిటీలో 31 వార్డులకుగాను అన్నిచోట్లా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గతంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికలు నిలిచిపోవడంతో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఇటీవల నిర్వహించిన స్ర్కూట్నీలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదు. దీంతో వీరిని అనర్హులుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనతో అంతర్గత ఒప్పందానికి వచ్చి వైసీపీని ఓడించాలని పావులు కదుపుతోంది. దీంతో జనసేన పోటీ చేస్తున్న 17 వార్డుల్లో 10 వార్డులు ఇస్తామని, 29 వార్డుల్లో జనసేన తరపున టీడీపీ విజయానికి కృషి చేయాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ మునిసిపాలిటీ గోదావరి కాల్వకు చెంతనే ఉన్నప్పటికీ పట్టణంలో ప్రతీ వేసవి సీజన్‌లో తాగునీటి ఇబ్బందులతో ప్రజలు విసిగివేశారిపోయి ఉన్నారు. ఈ సమస్యను తీర్చుతామని పక్కాగా హామీ ఇస్తేనే ఓటు వేస్తామని, లేకపోతే ఏ పార్టీకీ ఓటేయమని అక్కడి ప్రజలు తెగేసి చెప్తున్నట్టు తెలిసింది. గొల్లప్రోలు నగర పంచాయతీలో 20 వార్డులకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జనసేన, బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. సీట్ల సర్దుబాటు విషయంలో వైసీపీని రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. కాగా ఇక్కడ ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను పరిష్కరించడంలో స్థానిక యంత్రాంగం చొరవ చూపట్లేదనే ఆగ్రహంతో ఓటర్లున్నారు. ఇక్కడి ఒకటో వార్డులో వర్షాకాలంలో అన్ని ఇళ్లు నీటిలోనే ఉంటాయని, కనీసం రాకపోకలకు మార్గం లేకుండా చుట్టూ వర్షం నీరు చేరుతుంటుందని, దీనిని ఎవరూ పరిష్కరించట్లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడితో నానా కష్టాలు పడుతుంటామని.. కానీ తమ సమస్యలను పరిష్కరించకుండా మళ్లీ ఓట్లు అడగడానికి అభ్యర్థులు వస్తున్నారని మండిపడుతున్నారు. మిగిలిన మునిసిపాలిటీలైన తుని, పిఠాపురం, పెద్దాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం, రెండు నగర పంచాయతీలైన ఏలేశ్వరం, ముమ్మిడివరంల్లో కూడా తాగునీటి సమస్య నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసాక ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది. తర్వాత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లకు నాయకులు ఎటువంటి హామీలిస్తారు, ప్రధాన సమస్యల పరిష్కారానికి ఏం చెప్తారనేది వేచి చూడాలి.

కోనసీమలోని అమలాపురం పురపాలక సంఘంలో ఎన్నికలు వాయిదాపడే సమయానికి 30 వార్డుల్లో 145 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్ర్కూట్నీలో కేవలం నాలుగు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. టీడీపీ-28  వైసీపీ-63, జనసేన-25, బీజేపీ-12, సీపీఐ-1, స్వతంత్రులు 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో పలువురిని పోటీ నుంచి వెనక్కు తగ్గేలా రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. ప్రస్తుత బలాబలాల నేపథ్యంలో అటు ఓసీ, ఇటు బీసీలకు చెందిన మహిళా అభ్యర్థులు చైర్‌పర్సన్‌ స్థానంపై కన్నేసి ఉంచారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 20 వార్డుల్లో వైసీపీ, టీడీపీ, జనసేనలతో పాటు ఇతర పార్టీల నుంచి 73 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఉన్నప్పటికీ టీడీపీ-జనసేన కూటమిగా పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో ఉపసంహరణ                ముగిసే నాటికి ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన నాయకులు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement