Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయినవిల్లి ఎంపీడీవోపై చిందులేసిన వైసీపీ నేత అరెస్టు

జడ్పీటీసీ సహా ఆ పార్టీ నాయకులు నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు

ఎంపీడీవోకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

ఎంపీడీవోకు బహిరంగ క్షమాపణ  చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే కొండేటి

ఆమె ఆకస్మిక బదిలీకి తాత్కాలిక బ్రేక్‌

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) 

అయినవిల్లి ఎంపీడీవో కేఆర్‌ విజయను వైసీపీ నాయకుడు దూషించిన వ్యవహారం అనూహ్య పరిణామాలకు దారితీసింది. అయినవిల్లి జడ్పీటీసీ సహా ఆ మండలానికి చెందిన నలుగురు కీలక వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఓ నాయకుడిని మంగళవారం అరెస్టు చేశారు. ఎంపీడీవోకు మద్దతుగా ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, సర్పంచ్‌లు సంఘీభావం తెలిపి ఆందోళన, నిరసనలకు దిగారు. ఎంపీడీవోకు జరిగిన అవమానకర సంఘటనపై వైసీపీ తరపున ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బహిరంగ క్షమాపణ వేడుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వైసీపీ నాయకుడికి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌ దగ్గర భారీగా మోహరించారు. మరోవైపు ఎంపీడీవో బదిలీ వ్యవహారం కూడా రసవత్తరంగా మారింది. ఎంపీడీవో కేఆర్‌ విజయపై ప్రొటోకాల్‌ రగడ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులతో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన వాసంశెట్టి వీర వెంకట తాతారావు అలియాస్‌ తాతాజీ సోమవారం ఎంపీడీవో చాంబర్‌లో ఆమెపై పరుష పదజాలంతో దూషణలకు దిగాడు. దాంతో కలత చెందిన ఆమె తాతాజీతో పాటు అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు మేడిశెట్టి శ్రీనివాసరావు, కుడుపూడి రామకృష్ణలపై అయినవిల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

డీఎస్పీ వై.మాధవరెడ్డి స్వయంగా కేసును విచారణకు స్వీకరించి వాసంశెట్టి తాతాజీని మంగళవారం అదుపులోకి తీసుకుని అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో ఆ సామాజికవర్గానికి చెందిన వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పట్టణ స్టేషన్‌కు చేరుకుని మోహరించారు.ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ సురేష్‌బాబుతో చర్చించారు. డీఎస్పీ అయినవిల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఎంపీడీవోపై దూషణలకు దిగిన కేసులో వాసంశెట్టి తాతాజీని అరెస్టు చేసి మిగిలిన ముగ్గురి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఎంపీడీవో విజయపై దూషణల వ్యవహారాన్ని నిరసిస్తూ అయినవిల్లి మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. మండలంలోని సర్పంచ్‌లు ఈ ఘటనను ఖండించారు. సిరిపల్లిలో స్థానిక సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీ నాయకులు ఎంపీడీవో పట్ల వ్యవహరించిన తీరుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తాతాజీ కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నాడని వ్యాఖ్యానించారు. 


ఇదిలా ఉండగా ఎంపీడీవో కేఆర్‌ విజయను సోమవారం సాయంత్రానికే రౌతులపూడి బదిలీ చేస్తూ ఆకస్మిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఎమ్మెల్యే చిట్టిబాబు జోక్యం చేసుకుని కలెక్టర్‌ హరికిరణ్‌తో మాట్లాడడంతో ఉత్తర్వులు విడుదలైనప్పటికీ ఆమెను అయినవిల్లి నుంచి రిలీవ్‌ కావద్దని ఆదేశించడంతో బదిలీకి తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఈ వ్యవహారంతో రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే సైతం అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో బదిలీ ఆగినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement
Advertisement