ఆస్పత్రికి అన్నీ సమస్యలే...!

ABN , First Publish Date - 2022-08-19T05:06:27+05:30 IST

దర్శి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మంజూరైన 50 పడకల ఆస్పత్రికి అన్నీ సమస్యలే చుట్టుముట్టాయి. 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా హోదా పెంచినప్పటికీ అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీని నేటికీ పూర్తి చేయలేదు. అలాగే నూతన భవన నిర్మాణమూ నత్తనడకన సాగుతోంది.

ఆస్పత్రికి అన్నీ సమస్యలే...!
నిర్మాణంలో ఉన్న 50 పడకల హాస్పిటల్‌ భవనం, పనిచేయని రక్తనిల్వ కేంద్రం


నత్తనడకన దర్శి 50 పడకల హాస్పిటల్‌ కొత్త భవన నిర్మాణం

హోదా పెంచినా నేటికీ 30 పడకల వసతులు మాత్రమే

నియామకం కాని వైద్యులు, సిబ్బంది పోస్టులు

పూర్తిస్థాయిలో సేవలందక ఇబ్బందులుపడుతున్న ప్రజలు


దర్శి, ఆగస్టు 18 : దర్శి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మంజూరైన 50 పడకల ఆస్పత్రికి అన్నీ సమస్యలే చుట్టుముట్టాయి. 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా హోదా పెంచినప్పటికీ అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీని నేటికీ పూర్తి చేయలేదు. అలాగే నూతన భవన నిర్మాణమూ నత్తనడకన సాగుతోంది. నిర్ణీత గడువు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే జరిగాయి. వివరాల్లోకెళ్తే... దర్శి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి 2021 జనవరి 5న శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో చేపట్టిన ఈ భవన నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేయాలని గడువు విధించారు. రెండో సంవత్సరం గడుస్తున్నా 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నత్తనడకన నిర్మాణం సాగుతుండటంతో ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 


భర్తీకాని పోస్టులు 

50 పడకల ఆస్పత్రి మంజూరైనప్పుడు అదనంగా డాక్టర్లు, సిబ్బంది పోస్టులు మంజూరైనప్పటికీ నేటికీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. రెండేళ్లుగా పేరుకే 50 పడకల ఆస్పత్రి చలామణి అవుతున్నా 30 పడకల ఆస్పత్రి వసతులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎండీ, జనరల్‌ మెడిసన్‌ డాక్టర్‌, మత్తు డాక్టర్‌ పోస్టు భర్తీ చేయలేదు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఇరువురు జనరల్‌ డాక్టర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మరో మహిళా డాక్టర్‌ మెటర్నటీ లీవులో ఉండటంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. అధికశాతం డాక్టర్లు అందుబాటులో లేకపోవటం, మౌలిక వసతులు కూడా అంతంతమాత్రంగా ఉండడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందటం లేదు. ఎంతోకాలంగా రక్తనిల్వ కేంద్రం పనిచేయకపోవటంతో మూతపడింది. పెద్ద ఎక్స్‌రేప్లాంటు పనిచేయటం లేదు. మినీ ఎక్స్‌రే ప్లాంటు ద్వారా అరకొరగా రోగుల అవసరాలు తీర్చుతున్నారు. నూతల 50 పడకల ఆస్పత్రిభవన నిర్మాణం పూర్తి చేసి అన్నీ పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. నియోజకవర్గ కేంద్రమైన దర్శికి ఐదు మండలాల నుంచి రోగులు ఇక్కడకు వస్తుంటారు. రోజూ సుమారు 200 ఓపీలు వస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి అవసరాలను గుర్తించి వీలైనంత త్వరగా వైద్యుల నియామకంతోపాటు ఆస్పత్రి భవన నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-08-19T05:06:27+05:30 IST