మన ఊరు-మన బడి అందరిది

ABN , First Publish Date - 2022-05-22T05:06:53+05:30 IST

మన ఊరు-మన బడి కార్యక్రమం అందరిదని, అధికారులు సమన్వయంతో పనులు చేసి సకాలంలో పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు అధికారులను ఆదేశించారు.

మన ఊరు-మన బడి అందరిది
సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న హన్మంతరావు

  నాసిరకమైన పనులను సహించం

 25లోగా మోడల్‌ స్కూళ్లను సిద్ధం చేయాలి

 సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు


సంగారెడ్డి రూరల్‌, మే 21: మన ఊరు-మన బడి కార్యక్రమం అందరిదని, అధికారులు సమన్వయంతో పనులు చేసి సకాలంలో పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో జిల్లాలో మొదటి విడతో 441 పాఠశాలల్లో చేపట్టిన పనులు వందశాతం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో రెండు మోడల్‌ పాఠశాలలను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులకు సూచించారు. పాఠశాలల్లో రూ.30లక్షల లోపు జరగుతున్న అభివృద్ధి పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని, రూ.30 లక్షలకు పైబడిన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఏఈల వద్ద జాబితా తీసుకుని పనులను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాసిరకంగా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


గ్రామీణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలి


క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఈ నెల 25లోగా జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు క్రీడా ప్రాంగణాలు మోడల్‌గా తయారు చేయాలని ఎంపీడీవోలను కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశించారు. గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి, క్రీడా ప్రాంగణాల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతికి పంచాయతీ కార్యదర్శులు, అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. దళితబంధు పెండింగ్‌ యూనిట్లను ఈ నెల 31లోగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. నియోజకవర్గం వారిగా డెయిరీ, డొర్రెలు, కోళ్ల యూనిట్లకు సంబంధించి షెడ్లు వేయడం, బోర్‌ డ్రిల్లింగ్‌ చేయడం, మోటార్లు బిగించి కరెంటు కనెక్షన్‌ ఇవ్వడం తదితర పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. జూన్‌ మొదటి వారంలోగా గేదెలను కొనుగోలు చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, డీఆర్డీవో శ్రీనివాస్‌సరావు, పశుసంవర్థక జేడీ వసంతకుమారి, ఉద్యానవన జిల్లా అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:06:53+05:30 IST