అన్ని పత్రాలూ ఫేక్‌..!

ABN , First Publish Date - 2021-09-19T05:27:22+05:30 IST

పొలం కోసం బాల తిమ్మయ్య కొడుకులు చేసిన దుశ్చర్య బయటపడింది.

అన్ని పత్రాలూ ఫేక్‌..!

  1. బాల తిమ్మయ్య మరణం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు మార్ఫింగ్‌
  2. పొలం కోసం కొడుకుల దుశ్చర్య


నంద్యాల, సెప్టెంబరు 18: పొలం కోసం బాల తిమ్మయ్య కొడుకులు చేసిన దుశ్చర్య బయటపడింది. తిమ్మయ్యకు చెందిన మరణ, ఫ్యామిలీ మెంబర్‌ ధ్రువపత్రాలు మార్ఫింగ్‌ చేసినవని వెల్లడైనట్లు సమాచారం. నంద్యాల పట్టణంలోని టెక్కెలో నివాసం ఉంటున్న గిద్దలూరు బాల తిమ్మయ్య చనిపోయినట్లుగా కుమారులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమర్పించిన మరణ ధ్రువీకరణ పత్రం బేతంచెర్ల గ్రామపంచాయతీలో పొందినట్లుగా ఉంది. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ నంద్యాల రెవెన్యూ కార్యాలయం నుంచి జారీ చేసినట్లుగా ఉంది. అధికారులు విచారణ చేపట్టగా మరణ  ధ్రువీకరణ పత్రం బేతంచెర్ల పంచాయతీ కార్యాలయంలో తీసుకోలేదని తేలింది. నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పొందిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కూడా ఫేక్‌ అని తేలింది. 


కొడుకుల తరపున చక్రం తిప్పిన అధికార పార్టీ నేత 

నంద్యాల టెక్కె వీధిలో నివాసం ఉంటున్న బాల తిమ్మయ్య కుమారులు గిద్దలూరు మధు శ్రీనివాసులు, మధు సుధాకర్‌, మధుకుమార్‌ల తరపున స్థానిక అధికార  పార్టీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. డీల్‌ కుదుర్చుకొని ధ్రువపత్రాలను బాల తిమ్మయ్య కొడుకుల చేతిలో సదరు అధికార పార్టీ నేత పెట్టినట్లు తెలిసింది. కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ ద్వారా బాలతిమ్మయ్య చనిపోయినట్లుగా ధ్రువీకరించి, డూప్లికేట్‌ బార్‌కోడ్‌లను సైతం పత్రాల్లో పొందుపరచినట్లుగా తేలింది. ధ్రువపత్రాలపై అధికారుల డిజిటల్‌ సంతకాలు ఉండడం తోపాటు సీల్‌లను పకడ్బందీగా ముద్రించారు. అవుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమర్పించిన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ కాపీలపై పసుపుల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ హెడ్మాస్టర్‌ ఇ.నారాయణ గెజిటెడ్‌ సంతకం చేసినట్లుగా ఉంది. అయితే అది కూడా ఫోర్జరీ చేశారా అన్నది తేలాల్సి ఉంది. 



Updated Date - 2021-09-19T05:27:22+05:30 IST