అన్నీ ఆమోదించాం.. రాసుకోండి

ABN , First Publish Date - 2022-06-30T07:37:10+05:30 IST

చర్చల్లేవ్‌. చర్చించుకోవడాల్లేవ్‌. ప్రజాసమస్యల ప్రస్తావనల్లేవ్‌. పరిష్కారానికి నిలదీతల్లేవ్‌. అసలు.. అజెండాలో ఏముందో తెలుసుకునే ఓపికల్లేవ్‌. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించేశారు.

అన్నీ ఆమోదించాం.. రాసుకోండి

మూడు నిమిషాల్లో ముగిసిన మున్సిపల్‌ సమావేశం 

ప్రజా సమస్యలపై చర్చించని కౌన్సిలర్లు 

పలమనేరు, జూన్‌ 29: చర్చల్లేవ్‌. చర్చించుకోవడాల్లేవ్‌. ప్రజాసమస్యల ప్రస్తావనల్లేవ్‌. పరిష్కారానికి నిలదీతల్లేవ్‌. అసలు.. అజెండాలో ఏముందో తెలుసుకునే ఓపికల్లేవ్‌. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించేశారు. అలాగని రాసుకోమంటూ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. ఇలా.. మూడంటే మూడు నిమిషాల్లో పలమనేరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని ముగించేశారు. ఇదో రికార్డు కూడా. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పవిత్ర అధ్యక్షతన బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత 14 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అజెండాలోని 15 అంశాలను చర్చించకుండా, కనీసం చదవకుండా ఆమోదించామని చెబుతూ ముగించేశారు. కనీసం నీళ్లు, టీ కూడా తాగకుండా కౌన్సిలర్లు వెళ్లిపోయారు. పాలకవర్గం తీరుకు అధికారులు, విలేకరులు అవాక్కయ్యారు. అజెండాలోని అంశాలపై కౌన్సిలర్లు చర్చించడం, కొన్నింటిని  వాయిదా వేయడం, మరికొన్నింటికి అభ్యంతరం చెప్పడం, తమ వార్డుల్లో  సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా ఈ సమావేశం జరిగింది. సరిగ్గా 11 గంటల నాలుగు నిముషాలకు సమావేశం ప్రారంభమైంది. పట్టణ సమీపంలో ఈనెల 30వతేది జరిగే వైసీపీ జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలంటూ చైర్‌పర్సన్‌ పవిత్ర ఏకవాక్యంతో తన ప్రసంగాన్ని ముగించారు. అటుపిమ్మట మున్సిపల్‌ సిబ్బంది అజెండాలోని అంశాలను చదివేందుకు ఉపక్రమించారు. ‘అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించాం.. రాసుకోండి’ అంటూ కౌన్సిలర్లు లేచి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలపై చర్చించడం వంటి వాటితో మీటింగు చాలాసేపు జరుగుతుందని అధికారులు భావించారు. అందుకని ప్రతి కౌన్సిలర్‌ సీట్ల ముందు టేబుళ్లపై తాగునీటి సీసాలు అందుబాటులో ఉంచారు. టీ తెప్పించారు. ఒకరిద్దరు మాత్రమే తాగి సమావేశంనుంచి వెళ్లిపోయారు. కనీసం టీ తాగేంత సమయం కూడా లేకుండా అజెండాలోని అంశాలను వీరు ఆమోదించడం గమనార్హం. ఆలస్యంగా 11.10 గంటలకు వచ్చిన కొందరు  కౌన్సిలర్లు సమావేశం ముగిసిపోయిందని సహచరులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. చేసేదేమీలేక సమావేశానికి హాజరైనట్టు సంతకాలు చేసి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో ప్రజాసమస్యలు చర్చించి, పరిష్కరించి, ప్రజాధనాన్ని సక్రమమైన మార్గంలో వినియోగించేందుకు ప్రతినెల దాదాపు రూ.90 వేల మేరకు గౌరవ వేతనం తీసుకొనే మున్సిపల్‌ పాలకవర్గం సమావేశాలను ఇలా మమ అనిపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ కోర్టు పనిమీద వెళ్లడంతో ఈ మూడు నిమిషాల సమావేశాన్ని డీఈ పుష్పగిరినాయక్‌, ఆర్వో ఇమ్రాన్‌, ఇతర మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు. 

Updated Date - 2022-06-30T07:37:10+05:30 IST