పూటుగా నాటు

ABN , First Publish Date - 2020-06-05T10:15:29+05:30 IST

నాటుసారా జిల్లాలో ఏరులై పారుతోంది. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేసి సారాను ధ్వంసం ..

పూటుగా నాటు

లాక్‌డౌన్‌ వేళ పల్లెల్లో పరవళ్లు

 పట్టణాలకు సరఫరా

 పెరిగిన మద్యం ధరలతో 

నాటుకు మళ్లిన మందుబాబులు

ఇదే అదునుగా విచ్చలవిడిగా సారా తయారీ

కుటీర పరిశ్రమగా విస్తరించిన వైనం

మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాలే తయారీకేంద్రాలు

ఎక్సైజ్‌, పోలీసులు దాడులు చేసినా బేఖాతరు


మద్యం ధరలు మండుతుండటంతో పల్లెల్లో నాటుసారా ఏరులై పారుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో నెలన్నర పాటు మద్యం షాపులు బంద్‌ కావడం, దుకాణాలు తెరిచిన తర్వాత ధరలు విపరీతంగా పెంచడం, అడ్రస్‌ లేని బ్రాండ్లు అమ్ముతుండటంతో మందుబాబులు ప్రత్యామ్నాయంగా నాటుసారా బాట పడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. గత ఆరేడు నెలల్లో ఎక్సైజ్‌, పోలీసు శాఖలు జరుపుతున్న దాడులు, నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో దాదాపు ప్రతి మండలంలో నాటుసారా తయారవుతున్నట్లు అర్థమవుతోంది. అధికారులు దాడులు చేస్తున్న తయారీ, అమ్మకాలు మాత్రం ఆగడం లేదు.


గిద్దలూరు టౌన్‌, జూన్‌ 4: నాటుసారా జిల్లాలో ఏరులై పారుతోంది. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేసి సారాను ధ్వంసం చేసి తయారీదారులను అరెస్టు చేస్తున్న ప్రయోజనం శూన్యం. మద్యం కొత్త విధానం సారా తయారీకి ఊపునిచ్చిందనే విమర్శలున్నాయి. సర్కారు దుకాణాల్లో మద్యం ధరలు నింగినంటడంతో చాలావరకు మందుబాబులు నాటుసారా వైపు వెళుతున్నారు. ఇదే అదనుగా రూ.200 పెట్టుబడితో వెయ్యి ఆదాయం వస్తుండడంతో ఒకరిని చూసి మరొకరు నాటుసారా తయారుచేస్తున్నారు.


గతంలో మద్యం, బెల్టుషాపులు నిర్వహించిన వ్యక్తుల్లో ఎక్కువమంది ఇప్పుడు సారా అమ్ముతున్నట్లు తెలిసింది. మద్యం ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధర ఉండడం, కిక్కు ఎక్కువ ఇస్తుండటంతో చీప్‌లిక్కర్‌ తాగే వారిలో ఎక్కువమంది నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌, క్వార్టర్‌ బాటిల్స్‌లో నాటుసారాను నింపి లీటరు లెక్కన అమ్మకాలు జరుపుతున్నారు. పలుచోట్ల 5, 10 లీటర్ల క్యాన్లలో తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు మందుబాబులే చెబుతున్నారు. పెద్ద మొత్తంలో అంటే 5 లీటర్ల కంటే ఎక్కువైతే లీటరు రూ.350కు అమ్ముతున్నట్లు తెలిసింది. 


మారుమూల గ్రామాల్లో..

మద్యం ధరల పెరుగుదలతో మారుమూల గ్రామాల్లో నాటుసారా తయారీ విపరీతంగా పెరిగింది. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారపేట, అర్థవీడు మండలాల్లో అక్కడక్కడా మారుమూల కొండ ప్రాంతాల్లో నాటుసారా తయారవుతోంది. ఇక్కడి నుంచి పట్టణాలకు సరఫరా అవుతోంది. గతంలో క్వార్టర్‌ రూ.100కు విక్రయించే నాటుసారా రూ.120కు అమ్ముతున్నారు. మద్యంలో బ్రాండ్లు ఉన్నట్లుగా నాటుసారా కిక్కును ఆధారం చేసుకుని ధరలు నిర్ణయిస్తున్నారు. బెల్లంను నాలుగైదు రోజులు మరగబెట్టి తయారుచేసిన సారా అయితే ఒక ధర, అదే పదిరోజులు మరగపెట్టి తయారుచేసిన సారా అయితే మరో ధరకు అమ్ముతున్నట్లు తెలిసింది. బెల్లం ఎక్కువ రోజులు పులుపుపెట్టి తయారుచేసిన సారా ఘాటు ఎక్కువ ఉంటుందని మందుబాబులు చెబుతున్నారు.


ఎక్సైజ్‌ కన్నా పోలీసు దాడులే అధికం

గత ఆరేడు నెలలుగా నాటుసారా తయారీకేంద్రాలు విపరీతంగా పెరిగాయి. నల్లమల అటవీ ప్రాంతంలో సమీపంలో ఉండడంతోపాటు విక్రయానికి కూడా రైల్వేస్టేషన్‌ దగ్గర ఉండడం అక్రమార్కులకు అనువుగా మారింది. అయితే పోలీసులు సమాచారం వచ్చినప్పుడల్లా నాటుసారా బట్టీ తయారీకేంద్రాలపై దాడులు చేస్తూ బట్టీలను ధ్వంసం చేస్తున్నారు. సీఐ యు.సుధాకర్‌రావు ఆధ్వర్యంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు, బీపేట ఎస్‌ఐలు, సిబ్బంది సమాచారంతో దాడులు చేస్తున్నప్పటికీ నాటుసారా తయారీ మాత్రం ఆగడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఎక్సైజ్‌ పోలీసుల కన్నా సివిల్‌ పోలీసుల దాడులే అధికంగా కనిపిస్తున్నాయి.  


మద్యం ధరల పెంపుతో..

పలు మండలాల్లో 2నెలల క్రితం క్వార్టర్‌ నాటుసారా బాటిల్‌ రూ.100 అమ్మేవారు. ఇప్పుడు అదే బాటిల్‌ రూ.170 నుంచి రూ.200 అమ్ముతున్నారు. ప్రస్తుతం మద్యం ధరలను 70శాతానికిపైగా ప్రభుత్వం పెంచడం, లాక్‌డౌన్‌తో 45రోజులపాటు మద్యం షాపులు మూతపడటంతో సారా తయారీ అమ్మకందారులు ధరలు పెంచారని చెబుతున్నారు. గతంలో మద్యం సిండికేట్‌ ఉన్నపుడు వ్యాపార అభివృద్ధి కోసం గ్రామాల్లో బెల్టుషాపులను ప్రోత్సహించేవారు. కొత్త మ ద్యం విధానంలో బెల్టుషాపులను పూర్తిగా మూయించారు. అయితే మద్యం రేట్లు పెంచిన తర్వాత సారా తయారీ ఊపందుకోవడంతో గతంలో మద్యం బెల్టుషాపుల మాదిరిగా ఇప్పుడు నాటుసారా బెల్టుషాపులు నడుస్తున్నాయి. 


దాడులు పెంచాం.. త్వరలో అరికడతాం.. ఏ. అవులయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, మార్కాపురం

జిల్లా పశ్చిమ ప్రాంతంలో నాటుసారా తయారీ పెరిగిన మాట వాస్తవమే. కొందరు అదే పనిగా ఈ తయారీలో ఉ న్నారు. మాకొచ్చిన సమాచారం మేరకు వరుసగా దాడులు చేస్తు న్నాం. నాటుసారా తయారీ, విక్రయాలను అరికడతాం. చాలా కేసులు న మోదు చేశాం. అరెస్టులు చేశాం. పూర్తిగా తయారీని అరికట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం.


Updated Date - 2020-06-05T10:15:29+05:30 IST