గ్రామాల్లో ఫుల్లుగా..

ABN , First Publish Date - 2021-12-05T05:44:27+05:30 IST

గ్రామాల్లో ఫుల్లుగా..

గ్రామాల్లో ఫుల్లుగా..

పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాల దందా

గ్రామాల్లోని బెల్టుషాపులకు భారీగా తరలింపు

ధర పెంచేసి విక్రయాలు ఫ కొన్నిచోట్ల డోర్‌ డెలివరీ

తెల్లవారుజామున 4 గంటల నుంచే లభ్యం

పట్టించుకోని ఎస్‌ఈబీ, ఎకై్ౖసజ్‌ అధికారులు

దాడులు చేస్తున్నా ఆగని సారా తయారీ

ఇందుగలదు.. అందు లేదని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే దొరకును.. ఏ సమయంలోనైనా చేతికందును.. గ్రామాల్లో మందుబాబులు పాడుకుంటున్న పాట ఇది. అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులు మూసేస్తామని చెప్పిన సీఎం జగన్‌ మాటలేమో గానీ, ఇప్పుడు గ్రామాల్లో మద్యం ఎక్కడపడితే అక్కడ దొరుకుతోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బెల్ట్‌షాపులకు వేలాది మద్యం కేసులను అక్రమంగా తరలించేయడం ఓ ఎత్తయితే, కొన్నిచోట్ల డోర్‌ డెలివరీలు, మరికొన్నిచోట్ల తెల్లవారుజాము నుంచే పంపకాలతో గ్రామాలు నిషా నీడలోకి వెళ్లిపోతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో మద్యం విక్రయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ప్రైవేట్‌ మద్యం దుకాణాలు పోయి, ప్రభుత్వ మద్యం దుకాణాలు రావడం ఓ ఎత్తయితే, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం చూపుతూ వేలకొద్దీ మద్యం కేసులను బెల్ట్‌షాపులకు విక్రయించడం మరో ఎత్తు. మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అయితే, ఓ అడుగు ముందుకేసి డోర్‌ డెలివరీ కూడా చేసేస్తున్నారు. ఈ తతంగమంతా ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బెల్ట్‌షాపులను పూర్తిగా తొలగించామని ప్రభుత్వం చెబుతున్నా.. గతంలో కంటే భారీగానే పెరిగాయన్న నిదర్శనాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి.

నేలకొండపల్లి మద్యం దుకాణంలో అక్రమాలెన్నో..

పెడన మండలం నేలకొండపల్లిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. ఈ గ్రామంలో 400కు మించి జనాభా లేరు. అయినా ఈ దుకాణంలో పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పెడన మండలంతో పాటు కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లోని  బెల్ట్‌షాపులకు ఇక్కడి నుంచే మద్యం సరఫరా అవుతోంది. ఈ దుకాణం నుంచి రోజుకు కనీసం 100 కేసుల (కేసుకు 48 క్వార్టర్‌ బాటిళ్లు) మద్యం బెల్ట్‌షాపులకు సరఫరా అవుతోంది. క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.180, రూ.200 ఉంటే, దానికి అదనంగా మరో రూ.10 తీసుకుని అమ్ముతున్నారు. బెల్ట్‌షాపుల్లో అయితే, రూ.250కి విక్రయిస్తున్నారు. బందరు మండలం చిన్నాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలోనూ ఇదే పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాలైన భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు, తుమ్మలచెరువు, వాడపాలెంతో పాటు చిన్నాపురంలోనూ బెల్ట్‌షాపులకు ఇక్కడి నుంచే మద్యం సరఫరా అవుతోంది. తుమ్మలచెరువు గ్రామంలో రామాలయానికి 10 మీటర్ల దూరంలోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారు. రోజూ కనీసం రూ.8వేల నుంచి రూ.10వేల వరకూ ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నెలరోజుల క్రితం ఇక్కడి బెల్ట్‌షాపు నిర్వాహకురాలిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయినా మళ్లీ విక్రయాలు మొదలయ్యాయి. 15 రోజుల క్రితం చిన్నాపురంలోని బెల్ట్‌షాపుపై ఎస్‌ఈబీ అధికారులు దాడిచేసి మూడు కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి కేసు పెట్టకుండానే వదిలేశారు. రుద్రవరం పంచాయతీ శివారు గొల్లపాలెం బెల్ట్‌షాపుల్లో 24 గంటల పాటు మద్యం, కాపుసారా లభ్యమవుతోంది. ఈ గ్రామంలో ఉన్న నాలుగైదు బెల్ట్‌షాపుల వద్ద తెల్లవారుజాము 4 గంటల నుంచి మద్యం లభిస్తోంది. విక్రయాలు జరుపుతూ ఎవరైనా పట్టుబడితే రూ.10వేలకు తగ్గకుండా తీసుకుని పోలీసులే వదిలేస్తున్నారు. కాపుసారా కాస్తూ ఎవరైనా పట్టుబడితే వారి నుంచి రూ.వేలల్లో ముడుపులు తీసుకుంటున్నారు. బందరు మండలం పోలాటితిప్ప, కరగ్రహారం తదితర గ్రామాల్లో కాపుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. పోలాటితిప్ప గ్రామస్తులు కాపుసారా కాస్తూ పట్టుబడితే వారిని పాతేరు వంతెన వరకూ తీసుకొచ్చి వదిలేయడం రివాజుగా మారింది. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతున్న విషయంపై  విచారణ చేపడతాం. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం. నేలకొండపల్లి మద్యం దుకాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

- మోకా సత్తిబాబు, ఎస్‌ఈబీ ఏఎస్పీ



Updated Date - 2021-12-05T05:44:27+05:30 IST