
న్యూఢిల్లీ : లద్దాఖ్ సమీపంలో చైనా(China) కదలికలు ఆందోళనకరమని అగ్రరాజ్యం అమెరికా(Amercia) భారత్(India)ను అప్రమత్తం చేసింది. సరిహద్దు వెంబడి చైనా పలు మౌలిక సదుపాయాల ఏర్పాటును ఇందుకు కారణంగా పేర్కొంది. హిమాలయ ప్రాంతంలో చైనా మౌలిక సౌకర్యాలు పెంచుతుండడంపై యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఏ ఫ్లిన్(Charles A Flynn) మీడియాతో మాట్లాడారు. చైనా చర్యలు అస్థిరత, హానికరమైనవిగా చార్లెస్ వర్ణించారు. ‘‘ చైనా కదలికల స్థాయి అప్రమత్తతను సూచిస్తోంది. పశ్చిమ ప్రాంత కమాండ్లో కొన్ని వసతులను పెంచుకోవడం కలవరపరుస్తోంది. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుంది. ఇవన్నీ ఎందుకని చైనాను ఎవరైనా ప్రశ్నించాలి ’’ అని ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా కదలికలు ఎక్కువవ్వడం, చాపకింద నీరులా రహస్య మార్గాల నిర్మాణం, అస్థితపరిచే చర్యలు, హానికరమైన ప్రవర్తన ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరంకాదన్నారు. హానికరమైన శక్తులకు వ్యతిరేకంగా తామంతా ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుందని భారత్కు సంకేతాలిచ్చారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని పర్యవేక్షించే చార్లెస్ ఎంపిక చేసిన కొద్ది మంది జర్నలిస్టులతో బుధవారం మాట్లాడారు.