ముస్లింలు జీహాదీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలి... Al Qaeda పిలుపు...

ABN , First Publish Date - 2022-06-15T17:49:24+05:30 IST

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నేత అయిమన్ అల్ జవహిరి (Ayman

ముస్లింలు జీహాదీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలి... Al Qaeda పిలుపు...

న్యూఢిల్లీ : అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నేత అయిమన్ అల్ జవహిరి (Ayman al Zawahiri) ఒళ్లు గగుర్పొడిచే సందేశంతో ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రపంచంలోని ముస్లింలు ప్రముఖ జీహాదీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చాడు.  “Deal of the Century or Crusades Spanning Centuries.” శీర్షికతో ఆయన వరుసగా విడుదల చేస్తున్న వీడియోలలో ఇది ఐదోది. దీనిని ఆ ఉగ్రవాద సంస్థ మీడియా విభాగం ‘‘అస్ సాహబ్’’ ద్వారా విడుదల చేశాడు. 


గత, వర్తమాన సున్నీ (Sunni) జీహాదీలను ఘనంగా గౌరవించాలని ఈ వీడియోలో జవహిరి ముస్లింలకు పిలుపునిచ్చాడు. దీంతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు మరింత పెరిగిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జవహిరి గతంలో విడుదల చేసిన వీడియోలో అరబ్ నేతలను ఘాటుగా విమర్శించాడు. అల్‌ఖైదా భావజాలం గురించి ముస్లింలకు వివరించాడు. 


ఇటీవల జవహిరి భారత్, బంగ్లాదేశ్‌లకు వ్యతిరేకంగా జీహాద్ చేయాలని పిలుపునిచ్చాడు. ప్రవక్త మహమ్మద్‌కు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడినందుకు ఈ రెండు దేశాలపై జీహాద్ చేయాలన్నాడు. భారత దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించాడు. 


నిఘా సమాచారం ప్రకారం జవహిరి ప్రస్తుతం డ్యూరండ్ లైన్ సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్లు ఈ విషయాన్ని తోసిపుచ్చుతున్నారు. జవహిరి ఇరాన్‌లో ఉన్నాడని తాలిబన్లు చెప్తున్నారు. జీహాదీలకు తాలిబన్లు ఆదర్శంగా కనిపిస్తున్నారు. దీంతో భారత ఉపఖండంలో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. భారత ఉపఖండంలో అల్‌ఖైదా, ముస్లిం బ్రదర్‌హుడ్ చాలా చురుగ్గా ఉండటంతో ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. 


Updated Date - 2022-06-15T17:49:24+05:30 IST