అమ్మకానికి ‘మహారాజా’

ABN , First Publish Date - 2020-02-03T23:38:00+05:30 IST

మోదీ ప్రభుత్వం ‘ఎయిర్‌ ఇండియా’ను అమ్మేయడం సుబ్రహ్మణ్యస్వామికి ఇప్పుడుదేశద్రోహంతో సమానంగా కనిపిస్తున్నది. ఎయిర్‌ ఇండియాను అమ్మితే కోర్టుకు...

అమ్మకానికి ‘మహారాజా’

మోదీ ప్రభుత్వం ‘ఎయిర్‌ ఇండియా’ను అమ్మేయడం సుబ్రహ్మణ్యస్వామికి ఇప్పుడు దేశద్రోహంతో సమానంగా కనిపిస్తున్నది. ఎయిర్‌ ఇండియాను అమ్మితే కోర్టుకు వెడతానని అంటున్నారు ఆయన. దానిని అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ మూడో ప్రయత్నంతో కానీ స్వామివారికి ఈ జ్ఞానోదయం ఎందుకు కలగలేదో తెలియదు. నిర్ణయాధికారం ఏమాత్రం లేని ఓ నామమాత్రపు వాటా ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని సంస్థను అమ్మేసి ఉంటే స్వామికి అభ్యంతరం లేకపోయేదేమో! ప్రభుత్వం పట్టువదలకుండా రెండేళ్ళుగా ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్యస్వామి ఆ పని చేసి ఉండాల్సింది. న్యాయస్థానాలు ఏమంటాయన్నది అటుంచితే, ఆయన ప్రయత్నానికి కనీసం సందేశాత్మక విలువైనా ఉండేది.

 

‘మహారాజా’ను అమ్మకానికి పెట్టడం సాంకేతికంగా చూస్తే ఇది మూడోసారి. ప్రభుత్వానికి తన ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతూండటం మా చెడ్డ చిరాకు కలిగిస్తున్నట్టు ఉంది. కొనుగోలు దారుల్లో ఆసక్తి పెంచడం పేరిట ఈ మారు బిడ్డర్లకు చాలా మినహాయింపులు ఇచ్చింది. రెండేళ్ళుగా అమ్మకం జరగనందునో, కొనుగోలుదారుల మనోభిప్రాయాలకు అనుగుణంగానో ఈ మారు అది కచ్చితంగా అమ్ముడుపోయే రీతిలో నిబంధనలు తయారైనట్టు కనిపిస్తున్నది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో నూరుశాతం, గ్రౌండ్‌ హాండ్లింగ్‌ సేవలు అందించే సింగపూర్‌ జాయింట్‌ వెంచర్‌ ‘ఎఐఎస్‌టిఎస్‌’లో యాభైశాతం అమ్మకానికి పెట్టారు.


 

కొనుగోలుదారుమీద రుణభారం తగ్గించే ప్రయత్నమూ బలంగానే జరిగింది. మూడు సంస్థలపై యాజమాన్యహక్కులు దఖలుపరచుకోబోతున్న సంస్థ 23వేల కోట్లు మాత్రమే భారాన్ని భరించాల్సి ఉండగా, ఇతర అనుబంధ సంస్థల్లో ఎయిర్‌ ఇండియాకు ఉన్న వాటాలతో పాటు మిగతా బకాయిలు, రుణభారం దాదాపు 56వేలకోట్లు ఎయిర్‌ ఇండియా ఎసెట్స్‌ హోల్డింగ్స్‌ (ఏఐఎహెచ్‌ఎల్‌)కు బదిలీ అయిపోతాయి. ఇంతటి భారంతో పాటు ఓ పదిహేడువేల కోట్ల రూపాయలు ఆస్తులు దానికి దక్కుతాయి.

 

బిడ్డర్ల కనీస వ్యాపార విలువ మూడున్నరవేలకోట్ల రూపాయలుగా, కన్సార్షియంగా ఏర్పడినపక్షంలో భాగస్వాముల వాటా విలువ పదిశాతంగా ఇప్పుడు నిర్థారించారు. కన్షార్షియంలో సంస్థలే కాదు, వ్యక్తులు కూడా చేరవచ్చు. 2018నాటి అమ్మకం ప్రతిపాదనలో ఇవి ఐదువేలకోట్లు, 26శాతంగా ఉన్న విషయం తెలిసిందే. గత ప్రయత్నంలో డెబ్బయ్‌ ఐదుశాతం వాటాను మాత్రమే అమ్ముదామనుకున్న ప్రభుత్వం ఇప్పుడు నూరుశాతం అమ్మకంతో పూర్తిగా చేతులు దులిపేయ దల్చుకుంది.

 

ఎయిర్‌ ఇండియాకు ఉన్న ఇతరత్రా స్థిరాస్థులేవీ అమ్మకంలో భాగం కాదంటూనే, కొత్త పెట్టుబడిదారులు వాటిని వాడుకొనేందుకు అనుమతిస్తామని విమానయాన మంత్రి స్పష్టం చేశారు. మొత్తం సంస్థనూ, ఎంతో విలువైన బ్రాండ్‌నూ ఇంత సునాయసంగా అప్పగిస్తూనే దానిని గొప్ప ఆస్తిగా, ఎంతో విలువైనది ఆయన కీర్తిస్తున్నారు. ప్రైవేటీకరణ తరువాత కూడా తనకు కొంతవాటా ఉండాలన్న, కొనుగోలుదారుడు మరికొంత రుణభారాన్ని భరించాలన్న గతకాలపు ఆశలను ప్రభుత్వం ఈ మారు చంపేసుకుంది.

 

పదిహేడువేలమంది ఉద్యోగుల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ, బిఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగానే, వీఆర్‌ఎస్‌తో అనేకమందిని వదిలించుకోవచ్చు. మిగిలిన వారిని కొత్త యజమాని తొలుత స్వీకరించినా, ఆ తరువాత తగ్గించవచ్చు. సుదీర్ఘకాలంగా నష్టాలను చవిచూస్తున్న సంస్థను ఇలా తక్కువ ఖరీదుకు అమ్మివేయడం వినా మరోదారిలేదన్న వాదన అటుంచితే, మిగతా ప్రపంచానికి భారతదేశపు గౌరవచిహ్నంగా కనిపించే ఈ సంస్థ విషయంలో ఒక జాతీయవాద ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేమిటన్న ప్రశ్నలూ ఉన్నాయి.

 

ఈ దేశ గగనతలాన్ని ప్రైవేటుకు తెరిచిన తరువాత డజనుకుపైగా ప్రైవేటు విమాన సంస్థలు మూతబడ్డాయి. పాలకులకు ఎయిర్‌ ఇండియా అసమర్థతకు చిహ్నంగా, తెల్ల ఎనుగులాగా కనిపిస్తున్నది కానీ, 1953లో టాటా ఎయిర్‌లైన్స్‌ను జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతీయం చేసి ఎయిర్‌ ఇండియాను సృష్టించిన నాటినుంచీ అనేక తరాలవారికి దానితో మానసిక అనుబంధం ఉన్నది. ఇప్పుడు దేశంలో లాభాలు గడిస్తున్న ఓ ప్రైవేటు విమాన సంస్థకు సైతం 17వేల కోట్ల అప్పులున్నాయనీ, అందువల్ల, కేవలం 23వేల కోట్ల భారంతో ఎయిర్‌ ఇండియాను అందుకోబోతున్న కొత్త కొనుగోలుదారుడు సులభంగానే లాభాలు గడించగలడని కొందరి అంచనా. దానికున్న 121విమానాలు, అంతర్జాతీయ రూట్లపై దాని గుత్తాధిపత్యం ఇందుకు ఉపకరిస్తాయి. అయినా ఖరీదు ఎక్కువేనని ఇప్పటికీ బిడ్డర్లు అంటే, మరోమారు మరింత సులభతరమైన ప్రక్రియతో ప్రభుత్వం ముందుకొస్తుంది అంతే.

Updated Date - 2020-02-03T23:38:00+05:30 IST