ఎయిడెడ్‌ సర్దుబాట్లు

ABN , First Publish Date - 2021-10-19T06:19:14+05:30 IST

జిల్లాలోని 345 ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్దమైంది.

ఎయిడెడ్‌ సర్దుబాట్లు

నెలాఖరులోగా విద్యార్థుల సర్దుబాటు

నవంబరు 6లోగా టీచర్లకు బదిలీలు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని 345 ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్దమైంది. సోమవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా విద్యార్థులను సమీపంలోని మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చేర్పిస్తామని డిఈవో తాహెరాసుల్తానా తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై ఆమె మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశ ం నిర్వహించి పలు సూచనలు చేశారు. 


టీచర్ల బదిలీల ప్రక్రియ రేపటి నుంచి 

జిల్లాలో మూతపడిన ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 850 మంది టీచర్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాలను బుధ, గురు, శుక్రవారాల్లో సిద్ధం చేస్తారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ప్రకటించిన సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31వ తేదీలోగా వాటిని పరిష్కరించి, తుది జాబితాలను ప్రకటిస్తారు. నవంబరు ఒకటోతేదీన ఆయా యాజమాన్యాలవారీగా సర్దుబాటు చేయాల్సిన టీచరు పోస్టులను ప్రకటిస్తారు. రెండో తేదీ నుంచి ఐదోతేదీ వరకు రాష్ట్రస్థాయిలో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆరో తేదీన బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏడో తేదీన బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని డిఈవో తెలిపారు. 


మునిసిపల్‌ పాఠశాలల్లోనూ సర్దుబాట్లు

ఇప్పటివరకు మునిసిపల్‌ పాఠశాలల్లో ఎయిడెడ్‌ టీచర్లను, విద్యార్థులను విలీనం చేసేందుకు వీలు కుదరదని చెబుతూ వచ్చినా, తాజాగా ప్రభుత్వం ఆయా జిల్లాలవారీగా మునిసిపల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న  టీచర్ల పోస్టులను గుర్తించి, వాటిలో ఎయిడెడ్‌ టీచర్లను సర్దుబాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో ఎయిడెడ్‌ టీచర్లకు మునిసిపల్‌ పాఠశాలల్లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-19T06:19:14+05:30 IST