డబ్బులివ్వరా?
ABN , First Publish Date - 2022-06-16T07:11:44+05:30 IST
కిరాణా కొట్టులో కూడా అరువు ఇవ్వని రోజులివి. అంతా రొక్కంతోనే పని. పైగా ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్న రోజులు.
జిల్లాలో పేరుకుపోయిన ధాన్యం బకాయిలు
మొత్తం బకాయి రూ.634 కోట్లు
రైతులకు చెల్లించింది రూ.115.45 కోట్లే
రావాల్సిన సొమ్ములు రూ.519 కోట్లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) కిరాణా కొట్టులో కూడా అరువు ఇవ్వని రోజులివి. అంతా రొక్కంతోనే పని. పైగా ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్న రోజులు. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతు నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని అరువుకు కొనుగోలు చేయడమా? అప్పులు చేసి, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుని పంట పండించిన ధాన్యాన్ని రొక్కానికి కొనే పరిస్థితి కూడా లేకపోవడమే దారుణం. గతంలోనే మిల్లర్లో, దళారినో కొనుగోలు చేసి కళ్లంలోనే నగదు ఇచ్చేవారు. లేదా ఒకటి రెండు రోజుల్లో లెక్క అందించేవారు. ఇవాళ పరిస్థితి వేరు. ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పింది. మిల్లర్ల సమస్య లేకుండా, బ్రోకర్ల బెడద లేకుండా మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పింది. ప్రతీ గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారని విస్తృతంగా ప్రచారం చేసింది. చివరకు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసినట్టు చెబుతూ మిల్లర్లకే ఇచ్చింది. మిల్లర్లు నేరుగా కొనుచేసిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల అనుమతితో కొన్నట్టే ఆన్‌లైన్ చేశారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొంటామని చెప్పి, ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతు బ్యాంక్ ఖాతాల్లో డబ్బు పడుతుందని చెప్పింది. అలా ఎవరికీ పడలేదు. జిల్లాలో మొత్తం 1,59,716 ఎకరాల్లో రబీ సాగు చేశారు. మొత్తం 5,80,875 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశారు. అందులో స్థానింగా వాడుకునేది 87,131 మెట్రిక్ టన్నులు ఉంటుందని తేల్చారు. మిల్లర్లు సుమారు 58,604 మెట్రిక్ టన్నులు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారుల లెక్కకట్టారు. మిగతా 4,35,140 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ 301 ఆర్బీకే కేంద్రాల ద్వారా 3 లక్షల 08 వేల 200 టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం 29,131 మంది రైతులు ధాన్యం అమ్మగా, దానికి రూ. 634.57 కోట్ల మేర బకాయి ఏర్పడింది. కానీ ఇంతవరకూ రైతులకు రూ.115.45 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.519.12 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రేపో మాపో సొమ్ములు వస్తాయని ఆర్బీకేల్లోని సిబ్బంది చెబుతున్నారు. గడువు దాటిపోయి నా సొమ్ములు రాకపోవడంతో, అసలు తమ ధాన్యం సొమ్ము ఎప్పుడొస్తుందో అర్థంకాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈసారి ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లాలని ప్రభుత్వమే తెలిపింది. ఈనెల 1వ తేదీనే కాలువలకు నీరు వదిలారు. ఈసారి 79,639 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయవలసి ఉంది. దానికి 3,982 హెక్టార్లలో నారుమడులు వేయాలి. ఇప్పటివరకూ 484 హెక్టార్లలో నారుమళ్లు వేశారు. రైతులకు ధాన్యం డబ్బు వెంటనే ఇచ్చేసి ఉంటే మరింత ఏరియాలో నారుమళ్లు పడేవి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు లేక రైతులు క్రాప్‌హాలిడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కడియం మండలం రైతులు హెచ్చరికలు చేశారు. నల్లజర్ల రైతులూ అదే దారిలో ఉన్నారు. ధాన్యం డబ్బు ఇంకా పడకపోతే జిల్లాలో ఎక్కువమంది రైతులు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. ఒకపక్క కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోగా, ఇంకా 1.5 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయినట్టు చెబుతున్నారు. ఇది రైతుల వద్దే ఉందా, లేక కమీషన్‌దార్లు, మిల్లర్లూ కొనుగోలు చేసి ఇంకా ఆన్‌లైన్ చేయలేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికే జూన్ నెల సగం గడిచింది. ఇంకా రైతులు నారుమళ్లు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. ధాన్యం సొమ్ము వెంటనే ఇస్తేనే సాగులో దిగుతారు.