తుఫాన్‌ గండం

ABN , First Publish Date - 2020-11-25T05:05:07+05:30 IST

వర్షాలతో ఈసారి ఖరీఫ్‌ రైతన్నకు కన్నీరే మిగిల్చింది. దిగుబడులు భారీగా పడిపోయాయి. మళ్లీ నివర్‌ తుఫాన్‌ గండం పొంచి ఉంది.

తుఫాన్‌ గండం

ఎకరానికి 15 నుంచి 25 బస్తాలే..

పొంచి ఉన్న తుఫాన్‌ గండం

ఇదే అదనుగా కూలి, కోత ధరలు పెంచేశారు

ఉన్నపంటైనా దక్కుతుందా..!

బేతపూడి గ్రామంలో నాగేశ్వరరావు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. నారుమడి వేశాడు. వర్షాలకు నీటి మునిగి నారుమడి పూర్తిగా దెబ్బతింది. ఎకరానికి రూ.1000 పెట్టి నారు కొని నాట్లు వేశారు. ముందు వర్షాలకు కొంత మునగగా రెండోసారి వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. చివరికొచ్చేసరికి ఎంతలేదన్నా రూ.60 వేలు నష్టం మూటగట్టుకున్నాడు. ఇలా ఈసారి సార్వా అందరినీ ముంచింది.. ఎవరిని కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి..

భీమవరం రూరల్‌, నవంబరు 24 : వర్షాలతో ఈసారి ఖరీఫ్‌ రైతన్నకు కన్నీరే మిగిల్చింది. దిగుబడులు భారీగా పడిపోయాయి. మళ్లీ నివర్‌ తుఫాన్‌ గండం పొంచి ఉంది. భారీ వర్షాలు కురేసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గతంలో కురిసిన వర్షాలకు చాలాచోట్ల సార్వా చేలు నేలవాలాయి. చేలల్లో నీరు తొలగించి మాసూళ్లకు సిద్ధమవుతున్న తరుణంలో మళ్లీ వర్షాలు పడితే పంట చేతికొచ్చే అవకాశమే ఉండదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తుఫాన్‌ భయంతో ఉన్నపంట గట్టుకు చేర్చుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు. ఇదే అదునుగా పంటకోత మిషన్‌, కూలీలు ధరలు పెంచడంతో మాసూళ్ల ఖర్చు మరింత పెరిగిపోయింది. సార్వా సాగుకి ఆది నుంచి వాతావరణం అనుకూలించడం లేదు. అధిక వర్షాలతో నారుమడులు దెబ్బతినడంతో నారుమడులు మళ్లీ వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 34 వేల హెక్టార్లలో నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. మరోవైపు తెగుళ్లు పట్టి పీడించాయి. సాధారణంగా ఎకరానికి రూ.25 వేలు పెట్టుబడి అవాల్సి ఉండగా 29 వేలు పైగా పెట్టుబడి అయింది. దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఎకరానికి 15 బస్తాలు నుంచి 25 బస్తాల లోపే దిగుబడి ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఎకరం 10 బస్తాలు అయ్యేలా ఉన్నాయంటున్నారు. సరాసరి 18 బస్తాలు లెక్క వేసినా రూ.23 వేలు నుంచి 25 వేలు వరకు పంట సొమ్ము వస్తుంది. పెట్టుబడి 30 వేలు పోతే రూ.5 వేలుకి పైగా నష్టం వస్తుంది. అదే కౌలు రైతులకు లీజుతో కలిపి రూ.18 వేలు పైగా నష్టం వస్తుంది. తుఫాన్‌ గండాన్ని వరికోత మిషన్‌ యజమానులు కూలీలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. కోత మిషన్‌కు గంటకు రూ.2 వేలు నుంచి 22 వందలు తీసుకోవాల్సి ఉండగా రూ.3 వేలు తీసుకుంటున్నారు. కూలీలు కూడా పంట మాసూళ్లకు కాంట్రాక్ట్‌ పద్ధ్దతిలో పనిచేసి రూ.800 పైగా సంపాదిస్తున్నారు. పంట మాసూళ్లకే ఎకరానికి రూ.2500 వరకు పెట్టుబడి అవుతోంది.


వర్షం పడితే మిగిలేదేమీ ఉండదు

వర్షాలతో సార్వా పంట నష్టాల పాలైంది. గతేడాది 38 బస్తాలు పైనే దిగుబడి వచ్చిన చేలు ఇప్పుడు 20 బస్తాల లోపే ఉంటుందని పెట్టుబడులు కూడా రావని గునుపూడికి చెందిన రైతు నల్లం నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. చివరిలో తెగుళ్లతో పెట్టుబడి పెరిగింది. తుఫాన్‌ పేరుచెప్పి వరికోత యంత్రాల ధర పెంచేశారని, ఇప్పుడు వర్షాలు పడితే మిగిలేదేమీ ఉండదని భీమవరానికి చెందిన రైతు లక్ష్మణేశ్వరరావు వాపోయాడు.


Updated Date - 2020-11-25T05:05:07+05:30 IST