Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లీ మొదటికి!

మెడికల్‌ కళాశాలకు పరిశోధన క్షేత్రం భూమి

క్షేత్రానికి రుద్రవరంలో 16.5 ఎకరాలు కేటాయింపు

రూ.5.8 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు

పనులు చేపట్టేదెప్పుడో.. పూర్తయ్యేదెప్పటికో!


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రం బాలారిష్టాలను దాటడంలేదు. గతంలో రాడార్‌ కేంద్రం వద్ద ఉన్న పరిశోధన క్షేత్రం భూములను మెడికల్‌ కళాశాల నిర్మాణం నిమిత్తం తీసుకున్నారు. దీంతో అక్కడి నుంచి క్షేత్రాన్ని తరలించాల్సి వచ్చింది. ఈ కార్యాలయ ఫర్నిచర్‌ను, ల్యాబ్‌ సామగ్రిని మచిలీపట్నం మార్కెట్‌ యార్డులో భద్రపరిచారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది పెడన రోడ్డులో ఉన్న ఏరువాక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. పరిశోధన క్షేత్రానికి బందరు మండలం రుద్రవరంలోని గురుకుల జూనియర్‌ కళాశాల పక్కనే 16.5 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిలోనే గురుకుల జూనియర్‌ కళాశాలకు చెందిన పాడుబడిన పెద్ద భవనం ఉంది. ఈ భవనాన్ని కూలగొట్టి, క్షేత్ర నిర్మాణం చేపట్టాల్సి ఉంది.


నిర్మాణం ఎప్పటికో

వ్యవసాయ పరిశోధన క్షేత్రం అభివృద్ధి పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ కలెక్టర్‌ వద్దకు చేరింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, నిధులు విడుదల చేస్తేగానీ పనులు ప్రారంభం కావు. తొలుత పంట కాలువ, మురుగు బోదెలు తవ్వించడం, కేటాయించిన భూమిలో లోతట్టుగా ఉన్న ఆరు ఎకరాల భూమిని మెరక చేయడం, కార్యాలయ, ల్యాబ్‌ భవనాలు, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, గోడౌన్‌, ప్రహరీ నిర్మాణాలను చేపట్టేందుకు రూ.5.8  కోట్లతో అంచనాలు రూపొందించారు.


పంట కాలువ తవ్వకం పనులు 

పరిశోధన క్షేత్రానికి సంబంధించి ప్రస్తుతం పంట కాలువ పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నిధులతో, నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. నీరు ఎంతమేర అందుబాటులో ఉంటుందో చూసుకుని, రబీ సీజన్‌లో ఇక్కడ వ్యవసాయ పనులు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రధాన శాస్త్రవేత్త గిరిజారాణి తెలిపారు. భవనాల నిర్మాణానికి కేటాయించిన ప్రాంతం మినహా, మిగిలిన భూమిలో ఎకరం చొప్పున గట్లు పెట్టి, భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు పనులు ప్రారంభించాల్సి ఉందని ఆమె తెలిపారు. రబీ సీజన్‌లో కొంత మేరైనా ఇక్కడ వరిసాగు చేసేందుకు సమాయాత్తమవుతున్నామని చెప్పారు. భవనాలు సమకూరే వరకు భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలని ప్రతిపాదన పెట్టామన్నారు. కలెక్టర్‌, జేసీలకు ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తున్నామన్నారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో శాస్త్రవేత్తలు 12 సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి, ఎంసీఎం 100, ఎంసీఎం 101 వరి వంగడాలను కనుగొన్నారు. ఇతర వంగడాలు ప్రయోగదశలో ఉన్న సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే ప్రాంతానికి మార్పు చేశారు. ఈ క్షేత్రం పూర్తిస్థాయిలో పనిచేయాలంటే కనీసం 10 సంవత్సరాలైనా పట్టే సూచనలు  కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేస్తేనే పనులు వేగవంతమవుతాయి. 

Advertisement
Advertisement