Abn logo
Sep 30 2020 @ 00:46AM

వ్యవసాయేత ఆస్తులను ఆన్‌లైన్‌ చేయాలి...!

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీల పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులను గుర్తించి, ఆన్‌లైన్‌లో నమోదును చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన జిల్లాలోని ఐదు బల్దియాల చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, ఇంజనీర్లతో మంగళవారం సమావేశం నిర్వహించి, మాట్లాడారు. బల్దియాల పరిధిలో ఉన్న వ్యవసాయేతర భూములను ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ చేయడం ద్వారా మెరూన్‌ కలర్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అన్నారు. దీని ద్వారా భవిష్యత్‌లో భూములు, ప్లాట్ల పంచాయితీలు ఉండవని తెలిపారు.


ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి యజమానులకు ఎలాంటి నష్టం కలగకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ సర్వే చేపట్టినప్పుడు తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌లోని ఆక్రమణలను, వక్ఫ్‌, దేవాదాయ, అటవీ, రైల్వే శాఖల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా పరిశీలించి, సర్వే ఫారం నింపాలని అన్నారు. సమావేశంలో అన్ని మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లు, కమిషనర్లు,  టీపీఎస్‌లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement