వ్యవసాయ పరిశోధనా క్షేత్రం.. నిరుపయోగం

ABN , First Publish Date - 2022-04-29T05:12:00+05:30 IST

వ్యవసాయ పరిశోధనా క్షేత్రం.. నిరుపయోగం

వ్యవసాయ పరిశోధనా క్షేత్రం.. నిరుపయోగం
రుద్రవరంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించిన ప్రాంతం

క్షేత్రంలోని 26 ఎకరాలు మెడికల్‌ కళాశాలకు..

ప్రతిగా రుద్రవరం దగ్గర 16 ఎకరాల కేటాయింపు 

పరిశోధనలకు పనికిరాని భూమి

కొత్త భవనాల నిర్మాణాలెప్పుడో తెలియని పరిస్థితి

ప్రత్యేక కమిటీ సమావేశం జరిగితేనే ఫలితం


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్షేత్రం భూములను, భవనాలను ఏడాది క్రితం మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. ఉన్న భూములను అప్పగించేందుకు చూపిన శ్రద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో చూపట్లేదు. దీంతో ఏడాదిగా మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం తన ఉనికినే కోల్పోయింది. దీంతో ల్యాబ్‌ పరికరాలను మచిలీపట్నం మార్కెట్‌ యార్డులో ఉంచారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది మచిలీపట్నంలోని ఏరువాక కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ఏడాదిగా వరి నూతన వంగడాల పరిశోధనలు నిలిచిపోయాయి. ఈ క్షేత్రం అభివృద్ధి కోసం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీని వేశారు. ఈ కమిటీ ఎప్పటికి సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. గతంలో మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో ఎంసీఎం 100, ఎంసీఎం 101 వరి వంగడాలను కనుగొన్నారు. గతంలో స్వదేశీ వరి వంగడాలతో పాటు వివిధ దేశాల నుంచి  తెచ్చిన వంగడాలపైనా పరిశోధనలు చేసేవారు. 

అన్నీ సమస్యలే..

మచిలీపట్నం రాడార్‌ కేంద్రం సమీపంలో 26 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు, చుట్టూ ప్రహరీతో మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఉండేది. రూ.5.80 కోట్ల విలువైన భవనాలు ఉండేవి. మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం 26 ఎకరాల భూమిని అప్పగించారు. దీంతో వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. 26 ఎకరాల భూమిని వదులుకోవడంతో రుద్రవరం గురుకుల జూనియర్‌ కళాశాల పక్కనే మచిలీపట్నం-కోన రోడ్డు వెంబడి ఉన్న 16.34 ఎకరాలను వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించారు. ఈ భూమిలో గురుకుల జూనియర్‌ కళాశాలకు చెందిన పెద్ద పాత భవనం ఉండగా, దానిని కూల్చివేసి రాళ్లు తరలించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించిన 16.34 ఎకరాలు అసలు సాగుకు పనికొస్తుందా లేదా అనే అంశంపై శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు జరిపారు. ఈ భూమిలో 24 శాతం మేర చౌడు ఉన్నట్టు తేలింది. వాస్తవానికి భూమిలో ఎనిమిది శాతం కంటే చౌడు ఉంటే వరి సాగుకు యోగ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ భవనాలు, ప్రహరీ నిర్మాణాలకు సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అధికారులు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. ఈ ఏడాదిలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించిన భూమిలో ఉన్న గురుకుల జూనియర్‌ కళాశాల భవనాన్ని కూలగొట్టడం, ఐదు ఎకరాల్లో గట్లు వేయడం తప్ప మరే పనులూ చేయలేదు. ఇక్కడ పనులు ప్రారంభించాలంటే ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. భూమి అందుబాటులో లేకపోవడం, ఉన్న భూమి సక్రమంగా ఉండకపోవడంతో 2021 సంవత్సరానికి విత్తన ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రతిష్టాత్మకమైన ఈ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం పునఃప్రారంభంపై పాలకులు, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 

Updated Date - 2022-04-29T05:12:00+05:30 IST