మళ్లీ.. మళ్లీ.. రావాల్సిందే!

ABN , First Publish Date - 2022-08-09T05:13:00+05:30 IST

పేరులోనే స్పందన.. తీరులో కరువాయె. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన మొక్కుబడి చందమవుతోందన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.

మళ్లీ.. మళ్లీ.. రావాల్సిందే!
స్పందనకు వస్తున్న దివ్యాంగురాలు నారాయణమ్మ


పేరుకుపోతున్న ‘స్పందన’ అర్జీలు
ఏళ్ల తరబడి తిరుగుతున్న బాధితులు
పింఛన్ల తొలగింపుపై బాధితుల ఆందోళన
అధికారుల నుంచి మొక్కుబడి సమాధానం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

పేరులోనే స్పందన.. తీరులో కరువాయె. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన మొక్కుబడి చందమవుతోందన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. వినతులు పేరుకుపోతున్నాయి. కొన్నింటికి సంబంధిత అధికారులు ఏదో ఒక కారణం చూపి పరిష్కరించేశాం అంటున్నారు. వివిధ వర్గాలకు చెందిన బాధితులు మాత్రం మళ్లీ మళ్లీ విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. అనేక మంది పదే పదే వస్తూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సంవత్సరాల తరబడి తిరుగుతున్న వారూ ఉన్నారు. తాజాగా కలెక్టరేట్‌ స్పందనను సోమవారం పరిశీలించగా యథాతథ పరిస్థితి కనిపించింది. గతంలో ఆశ్రయించిన వారే మళ్లీ వచ్చారు. సమస్యల పరిష్కారంపై తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు.
జిల్లా కేంద్రాల్లో ఇస్తున్న అర్జీలను మండల స్థాయిలోని అధికారులకు పంపిస్తున్నారు. మండల స్థాయిల్లో ఏదో ఒక సమాధానం చెప్పి తప్పుకుంటున్నారు. ఫలితంగా బాధితులు స్పందనకు వస్తూనే ఉన్నారు. నిర్దిష్ట సమయంలో పరిష్కారానికి నోచుకోవడం లేదన్న వేదన ఎక్కువ మందిలో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి గత సోమవారం వరకు 5,235 వినతులు అందాయి. ఇందులో 364 గడువులో పరిష్కరించినట్లు చూపుతున్నారు. 4823 వినతులు పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు. వినతులు వస్తున్న వాటిలో రెవెన్యూ సమస్యలే అధికంగా ఉంటున్నాయి.

శాఖల వారీగా అందిన వినతులు
రెవెన్యూ వినతులు : 1684.
పంచాయతీరాజ్‌ : 472
గృహనిర్మాణ శాఖ : 442
సచివాలయాలకు సంబంధించినవి : 411
విద్యుత్‌ సమస్యలు : 364
పోలీస్‌ శాఖకు సంబంధించినవి : 233
మునిసిపల్‌ ప్రజల వినతులు : 207
ఆరోగ్య శ్రీ అమల్లో సమస్యలు : 136
గ్రామీణాభివృద్ధి శాఖవి : 131
రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించినవి : 127
----------------------------------------------------------

- ఈమె పేరు మజ్జి నారాయణమ్మ. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతానికి చెందిన ఈమె 90శాతం దివ్యాంగురాలు. 2006 నుంచి వికలాంగ పింఛను పొందుతున్నారు. ఉన్నట్టుండి ఈ నెలలో నిలిపేశారు. రెండు కాల్లు పనిచేయక కర్రల సాయంతో నడుస్తున్న ఈమె పింఛన్‌ను హౌస్‌ మ్యాపింగ్‌ కారణంతో ఆపేశారు. ఈమె తన తల్లి అప్పమ్మ వద్ద ఉంటోంది. తల్లికి పింఛను వస్తోందని, ఒక ఇంటిలో ఒక పింఛన్‌ కారణం చూపి నారాయణమ్మ పెన్షన్‌ ఆపేశారు. దీనిపై న్యాయం చేయాలని ఆమె సోమవారం స్పందనను ఆశ్రయించింది.

- ఆ బాలిక పేరు ఇందుకూరు వర్షిత(14). మానసిక దివ్యాంగురాలు. కాళ్లు చేతులు వంకర్లు తిరిగిపోయిన కారణంగా నడవలేని అభాగ్యురాలు. ఈమె తల్లి శ్రీదేవి కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతోంది. భర్త విడిచి పెట్టడంతో విడాకులు తీసుకుని గత కొన్నేళ్లుగా దివ్యాంగురాలైన కుమార్తెతో సహా విజయనగరంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వీరికి వేర్వేరుగా రేషను కార్డులున్నాయి. ఒకే ఇంటిలో కలిసి ఉన్న పాపానికి దివ్యాంగురాలి పింఛను తొలగించారు. 2020 నుంచి నేటి వరకు రెండేళ్లకు పైగా నెలకు రూ.3వేలు చొప్పున పింఛను అందేది. ఆగస్టు నెలలో బాలిక పింఛను ఆపేశారు. దివ్యాంగురాలి తాత చంద్రశేఖరరాజు రిటైర్డ్‌ ఉద్యోగి. ఆయనకు పింఛను వస్తోందని, హౌసింగ్‌ మ్యాపింగ్‌ కారణంగా ఒక పింఛన్‌ నిలిచిపోయిందని వలంటీరు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. లబోదిబోమంటూ స్పందనలో ఫిర్యాదు చేసింది.

- ఈయన మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామానికి చెందిన లగుడు త్రినాథ. తన రెండు కాళ్లూ పనిచేయడం లేదని, మూడు చక్రాల బండి ఇవ్వాలని కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈయనకు ఎప్పటికి మంజూరు చేస్తారో చూడాలి.

పంచాయతీ ఓ చోట.. సచివాలయం మరో చోట
అది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బలిజిపేట మండలం చాకరాపల్లి గ్రామంలో నిర్మించిన సచివాలయం. వాస్తవంగా ఈ గ్రామానికి సచివాలయం లేదు. ఈ గ్రామం అజ్జాడ గ్రామ సచివాలయ పరిధిలో ఉంది. అజ్జాడలో సచివాలయం కూడా నిర్మించారు. మరి చాకరాపల్లిలో సచివాలయం ఎలా అంటే ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. పక్క పంచాయతీ పదమాయవలస గ్రామంలో నిర్మించాల్సిన సచివాలయాన్ని సువర్ణముఖీ నది ఆవల ఉన్న చాకరాపల్లిలో నిర్మించారు. సచివాలయంతో గ్రామానికి ఎలాంటి సంబంధం లేకపోవడం విశేషం. దీనిపై పదమాయవలస సర్పంచి తట్టికోట సత్యనారాయణ కలెక్టర్‌ స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేశానని కాని అధికారులు పట్టించుకోవటం లేదని సర్పంచ్‌ నిరాశ వ్యక్తం చేశారు. కోర్టు నుంచి స్టే తెచ్చానని, అయినా గ్రామంలో సచివాలయాన్ని నిర్మించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్పంచి కలెక్టర్‌కు వివరించారు.

నేతన్న నేస్తం దూరం చేశారు
వీరిది బొబ్బిలి మండలం చింతాడ గ్రామం. గ్రామంలో 26 మంది నేతన్న నేస్తం లబ్ధిదారులున్నారు. 11 మందిని మూకుమ్మడిగా తొలగించారు. ఏటా ఒక్కో కుటుంబానికి రూ.24వేలు అందించే పథకానికి దూరం చేశారు. దీంతో సంబంధిత కార్యదర్శిపై స్పందనలో ఫిర్యాదు చేశారు.
-------------------


Updated Date - 2022-08-09T05:13:00+05:30 IST