వ్యాప్తి 1శాతం లోపే

ABN , First Publish Date - 2020-06-12T07:50:57+05:30 IST

కరోనా సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ర్పెడ్‌) చెందిందేమోనని భయపడుతున్నవారికి ఊరట కలిగించే వార్త! దేశంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సర్వేలో తేలింది...

వ్యాప్తి 1శాతం లోపే

  • దేశంలో ఎక్కడా సామాజిక వ్యాప్తి లేదు
  • 83 జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సర్వే.. 15 జిల్లాల్లో సున్నా కేసులు
  • 22 జిల్లాల్లో తక్కువ పాజిటివ్‌లు.. 16 జిల్లాల్లో మధ్యస్థాయి 
  • 18 జిల్లాల్లో తీవ్రం.. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో కేసులెక్కువ
  • మురికివాడల్లో మరీ ఎక్కువ.. మృతుల రేటు 0.08శాతం మాత్రమే
  • హాట్‌స్పాట్ల నమూనాల్లో 30శాతం మందికి వైరస్‌.. రెండో దశ సర్వే

న్యూఢిల్లీ, జూన్‌ 11: కరోనా సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ర్పెడ్‌) చెందిందేమోనని భయపడుతున్నవారికి ఊరట కలిగించే వార్త! దేశంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సర్వేలో తేలింది. కరోనా వ్యాప్తిపై దేశవ్యాప్తంగా 83 జిల్లాల్లో మే మధ్య, చివర్లో ఐసీఎంఆర్‌ ఈ సర్వే నిర్వహించింది. అంటే.. లాక్‌డౌన్‌ నిబంధనలు చాలావరకూ సడలించాక చేసిన సర్వేనే ఇది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌తో కలిసి ఈ సర్వే చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 83 జిల్లాలు, హాట్‌స్పాట్‌ నగరాల్లోని 28,595 కుటుంబాలను సందర్శించి.. 26,400 మంది నుంచి రక్తనమూనాలను సేకరించి ఐజీ-జి (ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ జి) యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్‌ కేసులు 1శాతం లోపే ఉన్నట్లు తేలింది. వైర్‌సకు హాట్‌స్పాట్లుగా మారిన ప్రాంతాల నుంచి 500 నమూనాలు.. నాన్‌-హాట్‌స్పాట్ల నుంచి 400 చొప్పున నమూనాలు సేకరించారు. నమూనాలు ఇచ్చినవారిలో కేవలం 192 మంది మాత్రమే (అంటే 0.73శాతం) ఇటీవలికాలంలో కొవిడ్‌-19 బారిన పడినట్టు తేలిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు.


దేశం లో లాక్‌డౌన్‌ ఆంక్షలు, కట్టడి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, వైరస్‌ విస్తృతవ్యాప్తిని అడ్డుకున్నాయని ఆయ న పేర్కొన్నారు. అయితే, దేశ జనాభా చాలా ఎక్కువ కాబట్టి.. మరింత ఎక్కువ మంది వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ రేటు గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో 1.09 రెట్లు అధికం. పట్టణాల్లోని మురికివాడల్లో 1.89 రెట్లు అధికమని.. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మనదేశంలో ప్రతి లక్షమంది జనాభాకుగాను మరణాల రేటు 0.59గా, వైరస్‌ వ్యాప్తి రేటు 20.77గా ఉందని వివరించారు. అంతర్జాతీయంగా.. ప్రతి లక్ష మందికీ సగటున 91.67 మంది వైరస్‌ బారిన పడుతున్నట్టు ఆయన తెలిపారు.  ఇంకా ఈ సర్వేలో ఏం తేలిందంటే..


  1. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్‌ కారణంగా సంభవిస్తున్న మరణాలు 0.08 శాతమే!
  2. సీరలాజికల్‌ సర్వే నిర్వహించిన 83 జిల్లాల్లో.. 15 జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కూడా రాలేదు. 22 జిల్లాల్లో కొద్ది సంఖ్యలో కొవిడ్‌-19 పాజిటివ్‌లు వచ్చాయి. 16 జిల్లాల్లో మధ్యస్థాయిలో.. 18 జిల్లాల్లో చాలా ఎక్కువగా కేసులు వచ్చాయి.
  3. మొత్తంగా చూస్తే ఐజీ-జీ పాజిటివ్‌ వచ్చిన కేసులు 1 శాతంలోపే ఉన్నా.. వాటిలో అత్యధికం కొవిడ్‌-19 హాట్‌స్పాట్లుగా మారిన ముంబై, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ నగరాల్లో నమోదైనవే. మొత్తం కేసుల్లో 30శాతం అక్కడివే. వారికి కూడా వైరస్‌ తమకు ఎప్పుడు సోకింది, ఎప్పుడు తగ్గిందీ తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు కేవలం 0.3 శాతమే.


లిఖితపూర్వక అనుమతితో..

ఐసీఎంఆర్‌ ఈ సర్వేలో పాల్గొన్నవారి వయసు, జాతి, మతం, ఉపాధి, ఆదాయం, వారికి ఏవైనా శ్వాసకోశ సమస్యలున్నాయా తదితర వివరాలను.. వారి లిఖితపూర్వక అనుమతితో సేకరించి పరీక్షలు జరిపింది. ప్రత్యేకంగా.. కట్టడి ప్రాంతాల్లో, కరోనాకు హాట్‌స్పాట్లుగా మారిన నగరాల్లో వైరస్‌ ఏ స్థాయిలో ప్రబలిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం రెండో దశ సర్వేను ఐసీఎంఆర్‌ నిర్వహిస్తోంది.


కచ్చితంగా సామాజికవ్యాప్తి లేదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సామాజికవ్యాప్తిపై సరైన నిర్వచనం ఇవ్వలేదు. భారత్‌ చాలా పెద్ద దేశం. కానీ, ఇక్కడ వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. చిన్న జిల్లాల్లో అయితే 1శాతం కంటే తక్కువగా ఉంది. పట్టణ, కట్టడి ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. కానీ, సామాజిక వ్యాప్తి దశలో మాత్రం భారత్‌ కచ్చితంగా లేదు.  -డాక్టర్‌ బలరామ్‌ భార్గవ


Updated Date - 2020-06-12T07:50:57+05:30 IST