37 ఏళ్ల అనంతరం డీఎంకేలో తొలిసారి ఇలా..!

ABN , First Publish Date - 2021-03-07T16:54:20+05:30 IST

స్టాలిన్‌ ప్రభుత్వంతో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి క్యాబినెట్‌లోనూ పనిచేస్తానంటూ

37 ఏళ్ల అనంతరం డీఎంకేలో తొలిసారి ఇలా..!

  • కాట్పాడి నుంచి మరొక అభ్యర్థి దరఖాస్తు!


చెన్నై : స్టాలిన్‌ ప్రభుత్వంతో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి క్యాబినెట్‌లోనూ పనిచేస్తానంటూ ఇటీవల డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారోగానీ.. పార్టీలో అందుకు భిన్నంగా ఓ సంఘటన నెలకొంది. ఆయన ఎప్పుడూ పోటీ చేసే కాట్పాడి నియోజకవర్గం సీటు ఆశిస్తూ ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్‌ కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇది వ్యూహాత్మకంగానే జరిగిందా, లేక అనుకోకుండా జరిగిందా అన్నదానిపై డీఎంకేలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేలూరు జిల్లా కాట్పాడి శాసనసభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. రెండవసారి (1971)లో డీఎంకే తరఫున బరిలో నిలిచిన దురైమురుగన్‌ విజయం సాధించారు. 


అనంతరం 1989, 1996, 2001, 2006, 2011, 2016లో జరిగిన ఎన్నికల్లోనూ దురైమురుగన్‌ విజయం సాధించగా, 1984, 1991లో పరాజయం చవిచూశారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తామంటూ డీఎంకే నేతలెవ్వరూ దరఖాస్తు చేసుకునేందుకు కూడా సాహసించలేదు. కాట్పాడి అంటేనే డీఎంకేకు కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌తోనూ దురైమురుగన్‌కు సన్నిహితసంబంధాలున్నాయి. కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవిని ఆయన కుమారుడు స్టాలిన్‌ చేపట్టగా, అన్బళగన్‌ మరణానంతరం 2020 సెప్టెంబరు 9న దురైమురుగన్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


ఆయన కుమారుడు కదిర్‌ ఆనంద్‌ ప్రస్తుతం వేలూరు ఎంపీగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆయన చెన్నైకే పరిమితమయ్యారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇక్కడ మరోవిశేషమేమంటే కాట్పాడిలో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న దురైమురుగన్‌ను సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు స్టాలినే శుక్రవారం ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఏదిఏమైనప్పటికీ ఇలా కాట్పాడి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు డీఎంకే తరఫున దురైమురుగన్‌ కాకుండా మరో వ్యక్తి ముందుకు రావడం చర్చనీయాంశమైంది. చూద్దాం! ఏం జరుగుతుందో?!.

Updated Date - 2021-03-07T16:54:20+05:30 IST