భయం గుప్పిట్లోనే అఫ్ఘాన్లు!

ABN , First Publish Date - 2021-09-14T09:21:01+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల వశమై.. వారి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడ్డా.. ఇంకా అఫ్ఘాన్లలో భయం వీడలేదు.

భయం గుప్పిట్లోనే అఫ్ఘాన్లు!

  • పాక్‌ సరిహద్దుల్లో వేల మంది.. స్పష్టం చేస్తున్న ఉపగ్రహ చిత్రాలు
  • కాబూల్‌ నుంచి పాక్‌కు తొలి విమానం
  • 70 మంది అఫ్ఘాన్లకు తాలిబాన్ల అనుమతి
  • 147 కోట్ల మానవతా సాయం: ఐరాస
  • అఫ్ఘాన్ల వెంటే ఉంటాం: భారత్‌


కాబూల్‌/న్యూయార్క్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల వశమై.. వారి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడ్డా.. ఇంకా అఫ్ఘాన్లలో భయం వీడలేదు. తాలిబాన్ల రాక్షస పాలనను గుర్తుచేసుకుంటూ గతనెల కాబూల్‌ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రజలు.. ఇప్పుడు దేశం వీడేందుకు పొరుగుదేశాల సరిహద్దుల్లో ఎదురుతెన్నులు కాస్తున్నారు. ఈ నెల 6న తీసిన ఓ ఉపగ్రహ చిత్రంలో.. అఫ్ఘాన్‌-పాక్‌ సరిహద్దు(చమన్‌ బార్డర్‌, టోర్ఖమ్‌)ల వద్ద వేల మంది అఫ్ఘాన్లు పొరుగుదేశంలోకి ప్రవేశించేందుకు గుమికూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. షేర్‌ఖాన్‌(అఫ్ఘాన్‌-తజ్‌కిస్థాన్‌), ఇస్లాం ఖాలా(అఫ్ఘాన్‌-ఇరాన్‌) సరిహద్దుల్లోనూ ఆయా దేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్న అఫ్ఘాన్లు కనిపిస్తున్నారు. కాబూల్‌ విమానాశ్రయం నుంచి అఫ్ఘాన్ల కోసం మొదటి అంతర్జాతీయ కమర్షియల్‌ విమానం సోమవారం బయలుదేరింది. 70 మంది అఫ్ఘాన్లను ఇస్లామాబాద్‌కు వెళ్లారు. వీరంతా పాక్‌లోని పలు ప్రాంతాలతోపాటు.. ఖతార్‌, తజ్‌కిస్థాన్‌కు వెళ్లనున్నారు. కాగా.. కల్లోలితంగా ఉన్న అఫ్ఘానిస్థాన్‌ను ఆదుకోవాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. 


ఐరాస తరఫున మానవతా సాయంగా రూ.147 కోట్లు విడుదల చేశామని, సభ్యదేశాలు మరో రూ. 4,400  కోట్లను సమకూర్చాలని కోరారు. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన సభ్యదేశాల ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు అఫ్ఘాన్లకు ఆహారం, ఔషధాలు, వైద్య సేవలు, తాగునీరు అందించాల్సిన అవసరముందన్నారు. ఇదే సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ.. పొరుగుదేశంగా అఫ్ఘాన్‌కు భారత్‌ సాయం ఎప్పటికీ ఉంటుందన్నారు. మానవతాసాయం అందించేందుకు అనుగుణంగా సురక్షిత రవాణా, ఇతర సేవలను పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు.


నేను బతికే ఉన్నాను: బరాదర్‌

తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను అఫ్ఘాన్‌ ఉప ప్రధాని అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ కొట్టిపారేశారు. ‘‘నేను బతికే ఉన్నాను. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు’’ అంటూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

Updated Date - 2021-09-14T09:21:01+05:30 IST