Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆప్యాయంగా..

  • పలుమార్లు వికారాబాద్‌కు వచ్చిన మాజీ సీఎం రోశయ్య
  • పరిగి, తాండూరులోనూ పర్యటనలు 
  • పెద్దాయనతో జిల్లాకు వీడని అనుబంధం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి/ పరిగి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ఆకస్మిక మృతి జిల్లా వాసులను కలచివేసింది. రోశయ్య మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న నాయకులు, సన్నిహితులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోశయ్యకు, వికారాబాద్‌ ప్రాంతానికి విడదీయలేని అనుబంధం ఉంది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వికారాబాద్‌కు పది పర్యాయాలకు పైగా రాగా, తాండూరు, పరిగిలోనూ పర్యటించారు. వికారాబాద్‌లో జిన్నింగ్‌ మిల్స్‌, క్రషర్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు పలు ప్రారంభోత్సవాలకు ఆయన హాజరయ్యారు. రోశయ్యతో వికారాబాద్‌ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణకు ఎనలేని అనుబంధం ఉంది. సత్యనారాయణ ఇంట్లో జరిగిన వివాహాలు, ఇతర శుభకార్యాలకు చాలా వరకు రోశయ్య హాజరయ్యారు. ఎస్‌ఏపీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హోదాలో ఆయన హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. బంట్వారం మండలం, యాచారంలో జరిగిన రైతు చైతన్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలోనే కొందరు యువకులు జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. పరిగి మినీస్టేడియంలో నిర్వహించిన వివిధ పథకాలు, కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కమతం రాంరెడ్డితో పాటు రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో హాజరయ్యారు. మూడేళ్ల కిందట, 2018, ఫిబ్రవరి 4న పరిగిలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారికి మార్గదర్శనం చేశారు. వికారాబాద్‌ ప్రాంతానికి వారు ఎవరు ఆయనను కలిసేందుకు వెళ్లినా ఆప్యాయంగా పలకరించేవారు. రోశయ్యతో మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌లకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ధారూరు మండలం, నాగారం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను విద్యుత్‌ శాఖ మంత్రి హోదాలో రోశయ్య ప్రారంభించారు. 

సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి

దివంగత మాజీ సీఎం రోశయ్య అకాల మరణం బాధాకరమని వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కొప్పుల మహే్‌షరెడ్డి, కాలే యాదయ్య అన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులు అలంకరించి ఆయన అమూల్యమైన సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తన జీవిత కాలం కాంగ్రెస్‌ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన అకాల మృతికి వారు విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement
Advertisement