ఏరోనాటికల్‌ పరిశోధకుడు మానస్‌ వర్మ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-05T09:05:54+05:30 IST

ప్రముఖ ఏరోనాటికల్‌ పరిశోధకుడు మానస్‌ బిహారీ వర్మ(78) మంగళవారం కన్నుమూశారు. బిహార్‌లోని దర్భంగ జిల్లా లహరియాసరాయ్‌లో తన స్వస్థలంలో గుండెపోటుతో...

ఏరోనాటికల్‌ పరిశోధకుడు మానస్‌ వర్మ కన్నుమూత

  • ‘తేజస్‌’ యుద్ధవిమాన నిర్మాణంలో కీలక పాత్ర

దర్భంగ, మే 4: ప్రముఖ ఏరోనాటికల్‌ పరిశోధకుడు మానస్‌ బిహారీ వర్మ(78) మంగళవారం కన్నుమూశారు. బిహార్‌లోని దర్భంగ జిల్లా లహరియాసరాయ్‌లో తన స్వస్థలంలో గుండెపోటుతో ఆయన మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. వాయుసేన అమ్ముల పొదిలో కీలకంగా మారిన తేజస్‌ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రెండుసార్లు వర్మను దర్భంగ వెళ్లి మరీ కలవడం గమనార్హం. బెంగళూరులోని ఏరోనాటికల్‌ అభివృద్ధి సంస్థ(ఏడీఏ)లో ఆయన కలాంతో కలిసి పనిచేశారు. 2018, మార్చిలో వర్మను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. వర్మ మృతి పట్ల బిహార్‌ గవర్నర్‌ ఫగూ చౌహాన్‌, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏరోనాటికల్‌ రంగంలో ఆయన చేసిన కృషి చిరకాలం నిలిచిపోతుందని నితీశ్‌ కొనియాడారు. 

Updated Date - 2021-05-05T09:05:54+05:30 IST