అన్నాడీఎంకేలో మళ్లీ విభేదాలు!

ABN , First Publish Date - 2020-09-20T14:47:47+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార అన్నాడీఎంకేలో మళ్లీ విభేదాలు తలెత్తాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన అత్యవసర ఉన్నత కార్యాచరణ మండలి

అన్నాడీఎంకేలో మళ్లీ విభేదాలు!

చెన్నై(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార అన్నాడీఎంకేలో మళ్లీ విభేదాలు తలెత్తాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన అత్యవసర ఉన్నత కార్యాచరణ మండలి సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. అదే సమయంలో పార్టీలో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయాలన్న పన్నీర్‌సెల్వం వర్గీయుల ప్రతిపాదనను ఎడప్పాడి ససేమిరా అంగీకరించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు. దీంతో ఎడప్పాడి వర్గీయులు, పన్నీర్‌సెల్వం వర్గీయులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో సభలో వాతావరణ వేడెక్కింది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా శాఖలను పెంచడం, ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేయడం, అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచనలు వంటి కీలక అంశాలపై చర్చించారు. అయితే ఈ అంశాలపై సమగ్రంగా చర్చించకుండా ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంకు పార్టీ అధికారాలు సమానంగా లేవనే విషయం చర్చకు వచ్చింది. పేరుకు సమన్వయకర్తగా వున్నా పన్నీర్‌సెల్వంకు పార్టీలో ప్రాధాన్యం లేదని ఆయన వర్గీయులు మొరపెట్టుకున్నారు. 


పార్టీ నేత జేసీడీ ప్రభాకర్‌ మాట్లాడుతూ... పార్టీకి ఇద్దరి నాయకత్వం కొనసాగించాల్సిందేనని, అదే సమయంలో గతంలో ప్రతిపాదించినట్టుగా 11మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేస్తే సమాన హక్కులు ఉంటాయన్నారు. ఈ విషయమై ఎడప్పాడి వెంటనే స్పందిస్తూ.. పార్టీలో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయడానికి ఇది అనువైన సమయం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు కార్యకర్తలను తరచూ కలుసుకుని ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో యేళ్లతరబడి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్‌ కార్యకర్తలను, స్థానిక నాయకులను బూత్‌ కమిటీ సభ్యులుగా నియమించాలని చెప్పారు. పన్నీర్‌సెల్వం వర్గీయులు చెప్పినట్టు మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో పన్నీర్‌సెల్వం వర్గీయులు తీవ్ర నిరాశ చెందారు. శాశ్వత ముఖ్యమంత్రి ఎడప్పాడి అంటూ మాజీ మంత్రి వలర్మతి  పేర్కొనడంతో సమావేశంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఇక ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు మద్దతు పలికే నాయకులు కొందరు ఎన్నికల వరకూ పార్టీలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతమున్న జంట నాయకత్వం కొనసాగాలని సూచించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయమై కీలకపాత్ర పోషిస్తుందని, ఓటు బ్యాంకును సంపాదించి పెడుతుందని పన్నీర్‌సెల్వం వర్గీయులు ఎంత చెప్పినా ఎడప్పాడి వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. 


మంత్రి తంగమణి మాట్లాడుతూ... సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై అనవసర చర్చ మానుకోవాలన్నారు. సీఎం అభ్యర్థి ఎడప్పాడియేనని ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదన్నారు. మంత్రి మాటకు పన్నీర్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం తమ వర్గీయులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే రీతిలో వ్యూవహరచనలు చేయడంపైనే అందరూ దృష్టి సారించాలని కోరారు. కార్యకర్తలను తరచూ కలుసుకునేందుకు పార్టీ కార్యాలయంలో వారానికి ఒక మారు పార్టీ నేతలిరువురూ సమావేశాలు జరపాలని ప్రతిపాదించారు. ముక్తాయింపుగా పార్టీ సమస్యలను చర్చించడానికి అనువుగా ఈనెల 28న కార్యాచరణ కమిటీ సమావేశం జరుపనున్నట్టు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ప్రకటించారు.

Updated Date - 2020-09-20T14:47:47+05:30 IST