ఉత్సవ సందడి

ABN , First Publish Date - 2022-08-10T05:06:42+05:30 IST

సీతంపేట కేంద్రంగా మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఉత్సవ  సందడి
సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు

 ‘మన్యం’లో ఆదివాసీ పండగ 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సీతంపేట: సీతంపేట కేంద్రంగా మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వేడుకలు నిర్వహిస్తుండడంతో అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. తొలుత సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న  అడవితల్లి విగ్రహానికి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో బి.నవ్య ప్రత్యేక పూజలు చేశారు. అమ్మతల్లికి చీర, గాజులను సమర్పించారు.  అనంతరం థింసా నృత్యాలతో ఊరేగింపుగా స్థానిక గిరిజన ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల వరకూ వెళ్లారు. అక్కడ మైదానంలో స్ర్తీ శిశు సంక్షేమ,  ఉద్యాన,  పరిశ్రమలు, పర్యాటక, హౌసింగ్‌ శాఖలు, వందన్‌ వికాస్‌ కేంద్రాలు  ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాల, సీతంపేట బాలుర, బాలికలు,  కేజీబీవీ, జూనియర్‌ రెసిడెన్షియల్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన సవర, థింసా నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కొంత అసంతృప్తితో తన ప్రసంగాన్ని కొనసాగించారు.  గిరిజనులకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలపై చర్చించకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా డైలాగ్‌లతో సమావేశాలు నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు అమ్ముకొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, రాజాం, పాతపట్నం ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి,   పాలకొండ ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు.  అయితే ఈ ఉత్సవాలకు  శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికారులెవరూ రాలేదు. మొత్తంగా గతంతో పోల్చుకుంటే ఆదివాసీ దినోత్సవానికి చాలా మంది ఆదివాసీ నాయకులు హాజరుకాలేదు.  

పార్వతీపురంలో.. 

పార్వతీపురం రూరల్‌ : జిల్లాకేంద్రం పార్వతీపురంలోనూ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా   స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.  గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే జోగారావు,  జేసీ ఆనంద్‌ తదితరులు థింసా నృత్యం చేశారు.  డప్పులు వాయిస్తూ ర్యాలీలో ఉత్సాహాన్ని నింపారు.  అనంతరం ఐటీడీఏలో అడవితల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు.  పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురం ఈఎంఆర్‌సీ, తదతర పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.  గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా చిన్నారులు వివిధ పాటలకు డ్యాన్సులు చేశారు.    ఆ తర్వాత టెన్త్‌, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన  విద్యార్థులకు బహుమతులను అందజేసి దుశ్శాలువాలతో సన్మానించారు.  పార్వతీపురం ఐటీడీఏ కేంద్రంగా పీవో పర్యవేక్షణలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని, గిరిజనుల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని  గిరిజన సంఘాల నాయకులు మంచాల పారమ్మ,  రంజిత్‌కుమార్‌, భగవాన్‌, సీతారాం, పల్లా సురేష్‌, తదితరులు కోరారు.  ఇదిలా ఉండగా కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు ఐటీడీఏ ప్రాంగణం బురదమయంగా మారింది. దీంతో ఉత్సవాలకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురదలోనే వేసిన కుర్చీల్లో గిరిజనులు కూర్చొన్నప్పటికీ అవస్థలు తప్పలేదు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, ఎంపీపీ మజ్జి శోభారాణి,  డీడీ కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 


Updated Date - 2022-08-10T05:06:42+05:30 IST