Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : అదనపు ‘గృహకల్పన’.. స్థానిక ప్రజ్రాపతినిధుల దందా.. లక్షలు కాజేసే కుట్ర

  • అక్రమ నిర్మాణాలకు అనధికార అనుమతులు
  • ఓట్ల కోసం.. నిబంధనలకు పాతర

సురారంలోని రాజీవ్‌ గృహకల్పలో అక్రమ నిర్మాణాలు, అదనపు గదులు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల వద్ద అదనపు గదులేంటి అనుకుంటున్నారా..? ఇది గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో మొదలైన నయా ట్రెండ్‌. పేదలకు సర్కారు ఇచ్చిన ఇళ్ల వద్ద స్థానిక ప్రజాప్రతినిధుల అనధికార అనుమతితో అక్రమ నిర్మాణాల జాతర సాగుతోంది. స్థానికులకు మేలు చేసే ముసుగులో రాజకీయ నాయకులు అక్రమార్జన, ఓట్ల వేటకు తెర తీశారు. ఇప్పటికే జగద్గిరిగుట్టలో ఈ తరహా నిర్మాణాలు దాదాపు పూర్తి కాగా.. కొంత కాలంగా సురారంలోని రాజీవ్‌ గృహ కల్పలో మొదలయ్యాయి. ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం, రెవెన్యూ, హౌసింగ్‌ బోర్డు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. కారణం.. స్థానిక ప్రజాప్రతినిధులంటే వారికి హడల్‌.


హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రాజీవ్‌ గృహ కల్ప పథకంలో భాగంగా నిరుపేదల కోసం సూరారంలో పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో 135 బ్లాకులుగా.. ఒక్కో బ్లాక్‌లో గ్రౌండ్‌ ప్లస్‌ మూడు అంతస్తుల్లో 32 ఇళ్లు నిర్మించారు. ఒక గది, కిచెన్‌, బాత్‌రూమ్‌ ఉన్న ఒక్కో ఇల్లు 250 చదరపు అడుగుల మేర ఉంటుంది. సైట్‌లో 60 అడుగుల మేర ప్రధాన, 30 అడుగుల వెడల్పుతో అంతర్గత రోడ్లు నిర్మించారు. ఇళ్లలో ఉండే వాళ్లు వాహనాలు పార్క్‌ చేసుకునేందుకు, మొక్కలు నాటేందుకు, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లు, విద్యుత్‌ స్తంభాల కోసం రహదారుల పక్కన స్థలమూ వదిలారు. పార్కులు, ఇతరత్రా అవసరాల కోసం అక్కడక్కడా ఖాళీ స్థలాలున్నాయి. 


భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకునే వదిలిన రోడ్లే అక్రమ నిర్మాణాలకు ఆలవాలమవుతున్నాయి. విశాలంగా ఉన్న రహదారులను ఒక్కో వైపు 10 అడుగుల మేర ఆక్రమించి అదనపు గదులు నిర్మిస్తున్నారు. ఈ గదులూ గ్రౌండ్‌ ప్లస్‌ మూడు అంతస్తులుగా నిర్మిస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఉన్న గదుల పక్కనే అదనపు నిర్మాణాలు చేపడుతోన్న స్థానికులు.. మధ్యలో ఉన్న గోడను తొలగిస్తే ఇంటి విస్తీర్ణం పెరుగుతుందని చెబుతున్నారు. ఓ పడక గది, హాల్‌తోపాటు, రెండు బాత్‌రూమ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అదనపు నిర్మాణాలతో మరో 200-230 చదరపు అడుగుల మేర విస్తీర్ణం పెరిగే అవకాశముంది.


పైపులైన్ల పైనా నిర్మాణాలు..

రోడ్ల పక్కనే డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లున్నాయి. రహదారులను ఆక్రమిస్తూ అదనపు గదులు నిర్మిస్తుండడంతో భూగర్భంలోని పైపులైన్లు ఆ ఇళ్ల కిందకు వెళ్తున్నాయి. భవిష్యత్తులో ఆ పైపులైన్లు పగిలినా, ఇతరత్రా మరమ్మతు చేయాల్సి వచ్చినా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పైపులైన్లు నిర్మాణాల కింద ఉండడంతో లీకేజీలు జరిగినప్పుడు మరమ్మతు కష్టంగా మారుతోంది. రాజీవ్‌ గృహకల్పలోనూ అదే పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. ఒక్కో వైపు పది అడుగుల మేర ఆక్రమిస్తుండడంతో రోడ్లు ఇరుకుగా మారి.. రాకపోకలతోపాటు.. సంబంధిత బ్లాక్‌లో ఉండే వారి వాహనాల పార్కింగ్‌కూ ఇబ్బంది కానుంది. కొన్ని బ్లాక్‌ల వద్ద ఒక్కో వైపు 13, 14 అడుగుల మేర శ్లాబ్‌లు వేస్తుండడంతో.. రెండు బ్లాక్‌లు కలిసిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఇళ్లలోకి గాలి.. వెలుతురు వచ్చే అవకాశం లేదు. అక్రమ నిర్మాణాలను రాజకీయ లబ్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తుంటే.. ప్రభుత్వ విభాగాలు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


ఓట్ల కోసమేనా..?

రాజీవ్‌ గృహకల్ప ఇళ్లలో రాజకీయం జరుగుతోంది. స్థానికులకు మేలు చేసే ముసుగులో ప్రజాప్రతినిధులు ఓట్ల వేట ప్రారంభించారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలను అన్నీ తామై ప్రోత్సహిస్తున్నారు. ఎవరూరారు.. ఏం ఇబ్బంది ఉండదు.. మేం అనుమతి ఇస్తున్నామని పేదలకు భరోసా ఇస్తున్నారు. సూరారంలో స్థానిక ప్రజాప్రతినిధి భర్త, జగద్గిరిగుట్టలోనూ స్థానిక ప్రజాప్రతినిధులే అనుమతులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి.. ఈ అవకాశం మళ్లీ రాదని హెచ్చరిస్తున్నారు. ఇంటి విస్తీర్ణం పెరుగుతుందన్న ఆశతో అప్పులు చేసి పేదలు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. బ్లాక్‌లో ఇళ్లున్న వాళ్లంతా చర్చించుకొని కాంట్రాక్టర్లకు ఉమ్మడిగా పనులు అప్పగిస్తున్నారు. 


పిల్లర్లు, శ్లాబ్‌ వరకు విస్తీర్ణాన్ని బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని అక్కడి నివాసి ఒకరు తెలిపారు. గోడలు, ఫ్లోరింగ్‌, ఇతరత్రా ఖర్చు మరో రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కావచ్చని చెబుతున్నారు. అదనపు గదుల నిర్మాణానికి అండగా ఉంటే మున్ముందు గంపగుత్తగా ఓట్లు పడుతాయన్న ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తోంది. అదనపు గదుల నిర్మాణానికి ఆసక్తి చూపకుంటే.. బలవంతంగా వారు ఇళ్లు అమ్ముకునే పరిస్థితిని ప్రజాప్రతినిధుల అనుచరులు కల్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విక్రయాల్లో అనుచరులు జోక్యం చేసుకొని రూ.లక్షలు కొల్లగొడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా ఖాళీ స్థలాల విక్రయానికీ తెర తీసినట్టు ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Advertisement