సర్దుబాటు షాక్‌

ABN , First Publish Date - 2022-08-05T05:48:37+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు పేరిట మళ్లీ ట్రూ అప్‌ చార్జీల భారం పడనుంది. గతంలో ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేయగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొంతమంది వినియోగదారులు కోర్టును కూడా ఆశ్రయించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్లీ ఇప్పుడు ట్రూ అప్‌ పేరుతో చార్జీల మోతకు సన్నద్ధమైంది. 2014 నుంచి 2019 వరకు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి 18 నెలలపాటు ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేయనుంది. దీంతో జిల్లా వినియోగదారులపై మొత్తంగా రూ.21 కోట్ల మేర భారం పడనుంది.

సర్దుబాటు షాక్‌

ట్రూఅప్‌ పేరుతో రూ.21కోట్ల మేర బాదుడు
2014 నుంచీ వినియోగించిన విద్యుత్‌పై అదనపు చార్జీలు
వినియోగదారులపై ప్రతినెలా రూ.1.16కోట్ల  భారం
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ వినియోగదారులపై అదనపు బాదుడుకు రంగం సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీల రూపంలో భారం మోపనుంది. 2014వ సంవత్సరం నుంచీ 2019 వరకు వినియోగించిన విద్యుత్‌పై సర్దుబాటు పేరిట..  18 నెలలపాటు అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ నెల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దీనిని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఒక్కో యూనిట్‌పై ఏడు పైసలు చొప్పున వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఏపీఈపీడీసీఎల్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి ప్రతినెలా సుమారు రూ.1.16కోట్లను అదనంగా వసూలు చేయనుంది. మొత్తం 18 నెలల్లో రూ.21కోట్ల మేర భారం మోపనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ చార్జీలు పెరగ్గా.. తాజాగా మరోసారి ట్రూఅప్‌ చార్జీల పేరిట అదనపు భారం పడనుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు అదనపు వసూళ్లు ఎమిటని మదనపడుతున్నారు. వాస్తవానికి గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేసింది. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కొంతమంది వినియోగదారులు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూఅప్‌ చార్జీలను గత ఏడాది నవంబరులో రెవెన్యూ జర్నల్‌ ద్వారా సర్‌చార్జీలతో పాటు బిల్లులో తిరిగి జమ చేసింది. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతితో ఇప్పుడు మళ్లీ ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేయనుంది.

అదనపు భారం ఇలా..
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ఐదేళ్లలో వినియోగించిన మొత్తం విద్యుత్‌కు.. యూనిట్‌కు 7 పైసలు వంతున ట్రూఅప్‌ చార్జీలను లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని ప్రస్తుత నెల నుంచి 18 నెలల పాటు సర్దుబాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 9,04,635 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడు విద్యుత్‌ డివిజన్లలో నెలకు 83,77,64,700 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వినియోగదారులపై ప్రతి నెలా ట్రూఅప్‌ చార్జీల పేరిట రూ.1.16 కోట్లు చొప్పున 18 నెలల్లో రూ.21 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇదిలా ఉండగా.. అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా ఉండనుంది. గతంలో ఎవరో వినియోగించిన విద్యుత్‌కు.. ప్రస్తుతం నివాసం ఉంటున్నవారు ట్రూఅప్‌ చార్జీలు చెల్లించాలి. ఇది చేయని నేరానికి శిక్ష అనుభవించడం లాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్రూఅప్‌ చార్జీల వసూళ్లను విరమించుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.  

ఈనెల నుంచే అమలు
ఈనెల నుంచే ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో ట్రూఅప్‌ చార్జీల సర్దుబాటు జరుగుతుంది. యూనిట్‌కు కేవలం ఏడు పైసలు చొప్పున ట్రూఅప్‌ చార్జీలను విధించాం. నెలకు సుమారు రూ.1.16 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది. 18 నెలల వరకు ఇన్‌స్టాల్‌మెంట్‌ గడువు విధించాం.
- ఎల్‌.దైవప్రసాద్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

Updated Date - 2022-08-05T05:48:37+05:30 IST