ధాన్యం కొనుగోళ్లలో లోటుపాట్లు తలెత్తితే చర్యలు

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో లోటు పాట్లు తలెత్తితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లలో లోటుపాట్లు తలెత్తితే చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న జగిత్యాల కలెక్టర్‌ రవి

అధికారులతో జగిత్యాల కలెక్టర్‌ రవి సమీక్ష

జగిత్యాల, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొనుగోళ్లలో లోటు పాట్లు తలెత్తితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సమష్టిగా పంట కొనుగోలు చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రెండున్నర నెలలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు సమష్టిగా పనిచేసి కొనుగోళ్లు విజయవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి ఇద్దరి చొప్పున ఇన్‌చార్జీలను నియమించడం జరిగిందన్నారు. గత సంవత్సరం మాదిరిగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎప్పుడు, ఏ రైతు తీసుకొని రావలెనో తెలియజేయా లన్నారు. రైతులకు టోకెన్లను ఇచ్చే బాధ్యత వ్యవసాయ అధికారులు నిర్వర్తించాలని, హమాలీల వివరాలు సెంటర్‌ వారీగా తయారు చేసుకొని వారు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. హమాలీలు లేకుండా సెంటర్లను ప్రారంభించవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల వివరాలు అందుబాటులో ఉంచాలని, లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ వాహనాల నంబర్ల ప్రకారం కేటాయించిన రైస్‌ మిల్లుకు వెళ్లే విధంగా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్లు, టెంట్లు, మంచినీరు, సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.    టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ జాగ్రత్తగా చేయాలన్నారు. ప్రతీ సెంట ర్‌లో ఒకే విధమైన ఫార్మాట్‌లో రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. ధాన్యాన్ని గ్రామ రైతుల వద్ద కాకుండా వేరే వారి వద్ద కొనుగోలు చేస్తే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, డీఆర్‌డీఓ పీడీ వినోద్‌ కుమార్‌, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌, డీసీఓ రామానుజచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST