కొవిడ్‌ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-13T05:53:17+05:30 IST

కొవిడ్‌ రెండో దశ వైరస్‌ నుంచి బాధితుల ప్రాణాలను కాపాడడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, దీనిని కొనసాగిస్తూ కొవిడ్‌ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు.

కొవిడ్‌ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి

  • జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఇనచార్జి మంత్రి కృష్ణదాస్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 12: కొవిడ్‌ రెండో దశ వైరస్‌ నుంచి బాధితుల ప్రాణాలను కాపాడడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, దీనిని కొనసాగిస్తూ కొవిడ్‌ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. బుధవారం ఆయన అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో కొవిడ్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. మంత్రి శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో కొవిడ్‌ కట్టడితో పాటు బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను  కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌ కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో ఇటీవల 1.7 కిలో లీటర్ల పీఎస్‌ఏ యూనిట్‌ను ప్రారంభించామని, 10 కిలో లీటర్ల సామర్ధ్యం గల ఆక్సిజన్‌ ట్యాంకును ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దాపురంలో రోజుకు నాలుగు కిలో లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యమున్న ఆక్సిజన్‌ యూనిట్‌ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామన్నారు. 

మంత్రి కృష్ణదాస్‌ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్‌ పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా సామరాఽ్ధ్యన్ని పెంచేందుకు గల అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. కమిటీలో ప్రజాప్రతినిధులు అందించే విలువైన సూచనలను స్వీకరించి అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రెమ్‌డెసివిర్‌పై ప్రజల్లో అపోహలు తొలగించాల్సి ఉందని, స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం మాత్రమే ఈ జౌషధాన్ని అవసరం మేరకు వినియోగించాలే తప్ప ఇష్టమొచ్చినట్టు ఉపయోగించకూడదన్నారు. అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజమహేంద్రవరం ఎంపీ  మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడారు. కొవిడ్‌   బాధితులకు వైద్య సేవలపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, కొండేటి చిట్టిబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాదరావు, వేగుళ్ల  జోగేశ్వరరావు పలు సూచనలు చేశారు. వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు జాయింట్‌ కలెక్టర్లు  జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, అమలాపురం సబ్‌  కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-13T05:53:17+05:30 IST