ఎన్‌వోసీ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-21T06:18:17+05:30 IST

చౌటుప్పల్‌ పట్టణంలోని జయభూమి లే-అవుట్‌(హెచ్‌ఎండీఏ) కు తప్పుడు ఎన్‌వోసీ జారీ చేసిన మునిసిపల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం తో పాటు పలువురు కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.

ఎన్‌వోసీ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
హెచ్‌ఎండీఏ లే-అవుట్‌లోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌, కౌన్సిలర్లు

చౌటుప్పల్‌ టౌన్‌, జనవరి 20: చౌటుప్పల్‌ పట్టణంలోని జయభూమి లే-అవుట్‌(హెచ్‌ఎండీఏ) కు తప్పుడు ఎన్‌వోసీ జారీ చేసిన మునిసిపల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం తో పాటు పలువురు కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. జయభూమి వెంచర్‌ను బుధవారం మునిసిపల్‌  వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌, సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ జి.లక్ష్మణ్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొయ్యడ సైదులు గౌడ్‌, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండమీది మల్లేశం లతో పాటు పలువురు కౌన్సిలర్లు పరిశీలించారు. అందులో మునిసిపాలిటీ అవసరాల నిమిత్తం పది శాతం క్రింద ఇతరుల ఆధీనంతో పాటు కోర్టు వివాదాల్లో  ఉన్న భూమిని  లే-అవుట్‌లో రియల్టర్లు చూపించడం, అలాంటి అక్రమ లే-లవుట్‌కు మునిసిపల్‌  అధికారులు ఎన్‌వోసీ జారీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ ఎం.రామదుర్గారెడ్డిని వెంచర్‌లోకి  రప్పించి, అందులో రియల్టర్లు చేసిన  అక్రమాలను వారు చూపించారు. అక్రమ లే-అవుట్‌కు ఎన్‌వోసీ ఎలా జారీ చేశారని కమిషనర్‌ను ప్రశ్నించారు.  తక్షణమే ఈ వ్యవహారంపై కలెక్టర్‌  విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారంగా మునిసిపాలిటీకి పది శాతం భూమిని వెంచర్‌ నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేశారని తెలిపారు. అందుకు సంబంధించి 16 లక్షల ఫీజును చెల్లించారని, అన్నీ సక్రమంగానే ఉండడంతో హెచ్‌ఎండీఏకు ఎన్‌వోసీ జారీ చేశామని తెలిపారు. 


Updated Date - 2021-01-21T06:18:17+05:30 IST